మాతృ హృదయం..

9 Jan, 2020 11:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇదొక భావోద్వేగపూరిత సన్నివేశం. ఎనిమిది నెలల పాటు కనిపించకుండా పోయిన కన్నకొడుకు కళ్లెదుట ప్రత్యక్షమైనప్పుడు ఆ మాతృమూర్తి చూపించిన అవాజ్య ప్రేమకు నిలువుటద్దం. ఏమైపోయాడో తెలియని బిడ్డ ఊహించని విధంగా తిరిగిరావడంతో పట్టరాని ఆనందంతో ఆ అమ్మ తన గారాల కొడుకుని ముద్దులతో ముంచెత్తింది. ‘ఇన్నాళ్లు ఎక్కడున్నావురా కన్నా’ అంటూ గుండెలకు హత్తుకుని రోదించింది. తన ‘ప్రాణాన్ని’ తిరిగి తెచ్చిన పోలీసులకు వందనాలు అంటూ మొక్కింది. తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఈ ఘటనకు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ వేదికగా నిలిచింది.

దర్పణ్‌.. ఇది తెలంగాణ పోలీసులు ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్‌. తప్పిపోయిన పిల్లలను వెతికి ఈ యాప్‌ సహాయంతో వారి గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎంతో మంది పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తాజాగా ఓ పిల్లాడిని దర్పణ్‌ యాప్‌ సహాయంతో ఫేషియల్ రికగ్నిషన్ టూల్ ద్వారా గుర్తించిన కుషాయిగూడ పోలీసులకు బాలుడి తల్లిదండ్రులకు కబురు పంపారు. ఎంతో ఆతృతగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. పిల్లాడి తల్లి కొడుకుపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఐజీ(మహిళల భద్రత) స్వాతి లక్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులను అభినందిస్తూ నెటిజనులు ట్విటర్‌లో కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: మరో అమ్మ కథ)

మరిన్ని వార్తలు