ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కారుడ్రైవర్ దొరికాడు

14 Sep, 2015 17:40 IST|Sakshi

బంజారాహిల్స్ : ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కళ్లుగప్పి లక్షలాది రూపాయలతో పరారైన కారు డ్రైవర్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఘటన వివరాలు వెల్లడించారు. గత నెల 20వ తేదీన పేట్‌బషీరాబాగ్‌లో నివసించే ఫిలిం డిస్ట్రిబ్యూటర్ వి.వాసుదేవరావు చౌదరి తన స్కోడా కారులో డ్రైవర్ గడ్డమీది సాయికుమార్(34)తో కలిసి కిక్-2 సినిమా హక్కుల కొనుగోలు కోసం రూ.21 లక్షలు తీసుకొని బంజారాహిల్స్‌లోని సాగర్‌సొసైటీలో ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు.

అయితే కారులోనే డబ్బును ఉంచి వాసుదేవరావు కార్యాలయం లోపలికి వెళ్లి వచ్చేలోగా కారు సహా డబ్బుతో డ్రైవర్ సాయికుమార్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చేపట్టి మెదక్ జిల్లా ఆందోల్ మండలం జోగిపేట గ్రామంలోని తన స్వగృహంలో తలదాచుకున్న సాయికుమార్‌ను అరెస్టు చేశారు. దొంగిలించిన సొమ్ములో రూ.16.50 లక్షలు తన సోదరుడు తాళ్ల విఠల్‌గౌడ్‌కు ఇచ్చి మిగతా సొమ్ముతో తీర్థయాత్రలకు వెళ్లాడు. రూ.2.40 లక్షలను విందు వినోదాలకు ఖర్చు చేశాడు. నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు కారుతో పాటు రూ.18.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు