ఎన్డీ అజ్ఞాత దళ సభ్యుడి అరెస్టు  

17 Aug, 2019 13:07 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ సునీల్‌దత్, వెనుక (ఎన్డీ పార్టీ అజ్ఞాత దళ సభ్యుడు రమేష్‌)

సాక్షి, కొత్తగూడెం : సీపీఐ(ఎంఎల్‌ న్యూడెమోక్రసీ) అజ్ఞాత దళ సభ్యుడిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ వెల్లడించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం చింతకుంట గ్రామ శివారు ఫారెస్టు ఏరియాలో ఎన్డీ పార్టీ అజ్ఞాత దళాలు సంచరిస్తున్నారనే సమాచారంతో లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ, స్పెషల్‌ పార్టీ సిబ్బంది కూంబింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆజాద్‌ దళానికి చెందిన, కొత్తగూడెం టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధి మూల్గుగూడెం పాలవాగు వాస్తవ్యుడు మడివి రమేష్‌ అలియాస్‌ రవి తారస పడటంతో అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ వద్ద కంట్రీమెడ్‌ తుపాకితో పాటు కిట్‌బ్యాగు లభించినట్లు చెప్పారు.

దళ కమాండర్‌ ఆజాద్, దళ సభ్యులు శ్యామ్, ఇతరులు తప్పించుకున్నారని వివరించారు. రమేష్‌ గత రెండేళ్ల నుంచి దళంలో తిరుగుతూ, గుండాల, కొమరారం ప్రాంతాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని, ఇప్పటి వరకు ఇతను గుండాలలో పోలీసుల మీద దాడి, అక్రమ వసూళ్లు తదితర నాలుగు క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. అరెస్టు చేసిన రమేష్‌ను రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వివరించారు. అజ్ఞాత దళ సభ్యులు ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ ఎస్‌ఎం అలీ, సీఐ గోపి, ఎస్‌ఐ నరేష్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు