మోసాలు.. అప్పులతో జల్సాలు..చివరికి..

23 Aug, 2019 10:19 IST|Sakshi
రాజేష్‌ను కట్టేసిన బాధితులు  

సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి) : మోసాలు.. అప్పులతో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్న మోసగాడ్ని వలపన్ని పట్టుకుని నడి సెంటర్‌లో కట్టేసిన సంఘటన సత్తుపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన చిట్టూరి రాజేష్‌ ఏడేళ్ల క్రితం పినపాక మండలం వచ్చి నర్సరీ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో నర్సరీ మొక్కలకు వచ్చిన పినపాక మండలం మంగతోగుకు చెందిన బాడిశ పార్వతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆరు నెలల నుంచి సహజీవనం చేస్తున్నాడు. పార్వతి తండ్రి ముత్తయ్య ఇటీవలే పదవీ విరమణ చేయటంతో వచ్చిన రూ.10లక్షల్లో రూ.5 లక్షలు నర్సరీ వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామని తీసుకున్నాడు. శ్రీరామ్‌ చిట్‌ఫండ్‌లో పల్సర్‌ మోటారు సైకిల్‌ను ముత్తయ్య పూచీకత్తుతో తీసుకున్నాడు. దీనికి వాయిదాలను కూడా చెల్లించటం లేదు.  

అప్పులు చేసి.. పరారీలో..  
చిట్టూరి రాజేష్‌ నర్సంపేట, పినపాకలో అప్పులు చేసి పరారీలో ఉన్నాడు. అప్పులిచ్చిన వాళ్లందరు బాడిశ పార్వతి వద్ద మొర పెట్టుకుంటున్నారు. బాడిశ పార్వతి చిట్టూరు రాజేష్‌ గురించి వాకబు చేయగా.. ముందే పెళ్లి అయిందని తెలిసింది. మోసగాడి ఆటను కట్టించాలని ఫోన్‌లో తరచూ సంభాషిస్తూ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంది. రాజేష్‌ ఆ ప్రాంతంలో అప్పులు ఎక్కువ అయ్యాయని.. మీ నాన్న వద్ద ఉన్న రూ. 5 లక్షలు పట్టుకొని రా.. ఇద్దరం కలిసి నర్సరీ పెడదామంటూ నమ్మబలికాడు. సరే వస్తానని చెప్పి.. రాజేష్‌కు అప్పులు ఇచ్చిన వాళ్లందరిని పిలుచుకొని సత్తుపల్లి వచ్చింది. పార్వతిని చూసిన రాజేష్‌ దగ్గరకు వచ్చి అప్పుల వాళ్లను చూసి పల్సర్‌ మోటారుసైకిల్‌పై పారిపోతుండటంతో అందరు పట్టుకొని సత్తుపల్లి బస్టాండ్‌ రింగ్‌ సెంటర్‌లోని బోస్‌బొమ్మ విగ్రహం రైలింగ్‌కు కట్టేశారు. ఇంతలో పోలీసులు వచ్చి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాజేష్‌పై ఏడూళ్లబయ్యారం, పినపాక, నర్సంపేట పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదు అయి ఉండటంతో సత్తుపల్లి పట్టణ సీఐ టి.సురేష్‌ అక్కడి ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి కానిస్టేబుళ్లను ఇచ్చి పంపించారు.  

మరిన్ని వార్తలు