జనశక్తి నేత నరసింహ అరెస్టు

27 May, 2019 03:16 IST|Sakshi


సాక్షి, హైదరాబాద్‌: జనశక్తి కీలక నేతను పోలీసులు అరెస్టు చేశారు. రెండు దశాబ్దాలుగా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బొమ్మని నరసింహ (55) అలియాస్‌ ఆనంద్‌ అలియాస్‌ నర్సిరెడ్డి ఉరఫ్‌ విశ్వనాథ్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసింహను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయన స్వస్థలం చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డిగూడెం. ఈ నెల 24న పోలీసులు నరసింహ కోసం ఇంటికి రాగా ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహ ఇంటికి వచ్చాడన్న సమాచారంతో నే పోలీసులు వచ్చి ఉంటారని తెలిసింది. బషీర్‌ బాగ్‌ లో ఆదివారం నరసింహను అరెస్టు చేశారు.  

పలు కార్యకలాపాల్లో బాధ్యుడిగా నరసింహ
రాష్ట్రస్థాయి నేతగా వ్యవహరిస్తోన్న నరసింహ తెలం గాణలో పలు జనశక్తి కార్యకలాపాల్లో బాధ్యుడిగా ఉన్నారు. ఒడిశాలో ఉద్యమంలో ఉన్న సమయంలో ఆదివాసీల కోసం పలు పోరాటాలు చేస్తున్న క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కటక్‌ జైల్లో ఏడేళ్లపాటు శిక్ష అనుభవించి 2013లో విడుదలయ్యారు. తెలంగాణలో సెక్రటరీగా పార్టీ కార్యకలాపాలు చూస్తున్నాడు. 2018లో మహబూబాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు చేసింది కరీంనగర్‌ పోలీసులని, అక్కడ నరసింహకు సంబంధించి ఓ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. అతని క్షేమంపై కుటుంబ సభ్యులు, ఆయన భార్య బొమ్మని పద్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో తెలియదని ఆయనకు ఏ హానీ తలపెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.  
 

మరిన్ని వార్తలు