సమష్టిగా ‘బెల్ట్‌’ తీశారు

4 Jul, 2018 13:13 IST|Sakshi
బెల్ట్‌షాపు నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న అప్పటి ఎస్సై నిరంజన్‌రెడ్డి (ఫైల్‌)

ఫలించిన పోలీసుల కృషి

రెండేళ్లుగా మద్యం అమ్మకాలు నియంత్రణ

గ్రామాల్లో తగ్గిన క్రైం రేటు

కథలాపూర్‌(వేములవాడ) : మూడేళ్ల క్రితం గ్రామాల్లో విచ్చల విడిగా మద్యం బెల్ట్‌షాపులు ఉండటంతో సులువుగా మద్యం దొరికేది. అమ్మకాలు జోరుగా సాగేవి. ఫలితంగా సాయంత్రం అయితే చాలు.. వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలు జరుగేవి. యువత మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడడం, పొద్దంతా కష్టపడిన కార్మికులు, కూలీలు వారికి వచ్చిన డబ్బులు మద్యానికే వెచ్చించడంతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్నిటికీ బెల్ట్‌షాపులే కారణమని భావించారు పోలీసులు. బెల్ట్‌ షాపులు మూసివేస్తే నేరాలు తగ్గుతాయని నిర్ణయించారు. ఇందుకు గ్రామీణుల సహకారం తీసుకున్నారు. 2016, జనవరి 6 నుంచి అప్పటి ఎస్సై నిరంజన్‌రెడ్డి బెల్ట్‌ తీయడం ప్రారంబించారు. సుమారు రెండేళ్ల  నుంచి బెల్ట్‌షాపులు మూసివేత కొనసాగుతుండటంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. క్రైంరేటు గణనీయంగా తగ్గింది.  


55 షాపులకు చెక్‌
కథలాపూర్‌ మండలంలో 18 గ్రామాలున్నాయి. 2015, డిసెంబర్‌ 31 వరకు మండల వ్యాప్తంగా సుమారు 55 బెల్ట్‌షాపులు అక్రమంగా నిర్వహించేవారు. బెల్ట్‌షాపుల్లోనే సిట్టింగ్‌ సౌకర్యం  ఉండటంతో మందుబాబులు గ్రూపులుగా వెళ్లి మద్యం సేవించేవారు. ఈక్రమంలో కొన్నిసార్లు అక్కడే వివాదాలు జరిగేవి. కొన్ని ప్రైవేట్‌ పంచాయితీలకు బెల్ట్‌షాపులు  వేదికగా మారిన సంఘటనలున్నాయి. ఈ క్రమంలో 2016, జనవరి 6న కథలాపూర్‌ ఎస్సైగా నిరంజన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక మొదటగా బెల్ట్‌షాపులపై దృష్టిసారించారు. షాపులు నిర్వహించొద్దని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. కొత్త అధికారి.. ఇవన్నీ కామన్‌ అనుకున్నారు నిర్వాహకులు. ఏకంగా బెల్ట్‌షాపు నిర్వాహకులను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అంతే మండలంలోని బెల్ట్‌షాపులు అన్నీ మూతబడ్డాయి. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఆయన బదిలీ తర్వాత వచ్చిన ఎస్సైలు ఆరీఫ్‌ అలీఖాన్, జాన్‌రెడ్డి, రాజునాయక్, ప్రస్తుత ఎస్సై నాగేశ్వర్‌రావు కూడా అదే విధానాన్ని పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో మద్యం బెల్ట్‌షాపు ఊసెత్తకుండా చేశారు. పల్లెల్లో వివాదాలు తగ్గుముఖం పట్టాయి. ప్రశాంత వాతావరణం నెలకొంది. 

తగ్గిన నేరాల సంఖ్య 
2015, డిసెంబర్‌ 31 వరకు కథలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సుమారు 146 నేరాలు నమోదుయ్యాయి. 2016 జనవరి నుంచి బెల్ట్‌షాపులు మూసివేతతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్న ఆటో, జీపు డ్రైవర్లకు పోలీసు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు.
 2016లో మండలంలో నమోదైన నేరాల సంఖ్య 65. 2017లో మళ్లీ 120కి చేరింది. మద్యం బెల్ట్‌షాపులు బంద్‌ ఉం డటంతో పోలీసుల కృషి ఫలించిందని మండలంలోని మహిళలు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసులకు కృతజ్ఞతలు
అధికారులు కొత్తగా వచ్చినప్పుడు ఏదో అంటారు అనుకున్నాం. కథలాపూర్‌ మండలంలో అప్పటి ఎస్సై నీరంజన్‌రెడ్డితోపాటు ఇప్పటివరకు కథలాపూర్‌లో విధులు నిర్వర్తించిన పోలీస్‌ అధికారులు మద్యం బెల్ట్‌షాపులు మూసివేయించడం పక్కాగా అమలు చేశారు. కథలాపూర్‌ మండలంలో మార్పులు తేవడం సంతోషంగా ఉంది. బెల్ట్‌షాపులు లేకపోవడంతో గ్రామాల్లో కొత్త మార్పులు వచ్చాయి. పోలీసులకు కృతజ్ఞతలు.
– బద్దం మహేందర్, భూషణరావుపేట 


మార్పు సంతోషకరం..
గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉండడంతో మద్యం సేవించడం ఎక్కువ మందికి అలవాటైంది. యువత ఒకరినిచూసి మరొకరు మద్యం సేవించి చేడిపోతున్నారు. మద్యానికి బానిస అవుతుండటం ఆందోళన కలిగించింది. ఇవన్నిటికీ కారణమైన బెల్ట్‌షాపులు మూసి ఉండటంతో పేద కుటుంబాలు కాస్తా ఆర్థికంగా ఎదిగి సంతోషంగా ఉంటున్నారు. బెల్ట్‌షాపుల మూసివేతకు కృషిచేసిన పోలీస్‌ అధికారుల సేవలు మరిచిపోలేం. 
– మైస శ్రీధర్, చింతకుంట

ప్రజల సహకారంతో విజయవంతం
ప్రజల సహకారంతోనే బెల్ట్‌ షాపులను నియంత్రించగలిగాం. రెండేళ్లుగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేశాం. యువత వ్యసనాలకు బానిసకావొద్దు. యువత మంచి లక్ష్యంతో ముందుకు వెళ్లాలి. మంచి మార్గాల్లో వెళ్లే యువతను పోలీస్‌శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. మండలంలో గతంలోకన్నా నేరాల సంఖ్య తగ్గడం సంతోషం. ప్రజలు ఎల్లప్పుడూ పోలీస్‌శాఖకు సహకరించాలి. 
– నాగేశ్వర్‌రావు, ఎస్సై, కథలాపూర్‌ 

మరిన్ని వార్తలు