‘‘డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’’

2 Apr, 2020 14:51 IST|Sakshi
వ్యక్తిపై దాడి చేస్తున్న పోలీసులు

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు యావద్దేశం లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ.. నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. కొన్ని చోట్ల ఖాకీలు ఎవరినీ నొప్పించకుండా కరోనాపై అవగాహన కల్పిస్తుంటే.. మరికొన్ని చోట్ల ప్రజల్ని ఇష్టానురీతిలో హింసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వార్తల్లో నిలిచే హింసాత్మక ఘటన ఒకటి తాజాగా వనపర్తిలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ నిబంధనలను పక్కన పెట్టి రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని అతడి కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు పోలీసులు. తన తండ్రిని ఏమీ చేయోద్దంటూ పిల్లాడు మొత్తుకుని ఏడుస్తున్నా కనికరించకుండా అమానుషంగా ప్రవర్తించారు. ‘‘ డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’ ’’  అంటూ ఒకవైపు తండ్రిని, మరోవైపు తండ్రిపైకి దూకుతున్న పోలీసులను పిల్లాడు బ్రతిమలాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు. ( గాంధీ ఆసుపత్రి ఘటనపై కేటీఆర్‌ సీరియస్‌ )

ఆఖరికి చెప్పులు వేసుకోవటానికి కూడా అంగీకరించని పోలీసులు పిల్లాడిని, అతడి తండ్రిని జీపులో కుక్కి తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సదరు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ఇలాంటి పోలీసుల ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. హోమ్‌ మినిష్టర్‌ మహమూద్‌ అలీ, తెలంగాణ డీజీపీలు దయజేసి ఇటువంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోండి. కొద్దిమంది పోలీసుల తిక్క చేష్టల వల్ల వేలాది మంది పోలీసులకు అపఖ్యాతి వస్తోంద’ని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు