పోలీస్‌ భవనాలు, టెక్నాలజీకే ప్రాధాన్యత

23 Jan, 2019 01:36 IST|Sakshi

బడ్జెట్‌ కేటాయింపులపై ప్రభుత్వానికి పోలీస్‌ శాఖ ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో నూతనంగా నిర్మిస్తున్న కమిషనరేట్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, డీసీపీల భవనాల కోసం ఈ సారి భారీ స్థాయిలో బడ్జెట్‌ కేటాయించాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఏ విభాగానికి ఎన్ని నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలంటూ ఇటీవల ఆర్థిక శాఖ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఆయా విభాగాల అధిపతులు సంబంధిత అంశాలతో ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందజేశారు. అందులో భాగంగా రాష్ట్ర పోలీస్‌ శాఖ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీస్‌ శాఖ ఆధునీకరణలో భాగంగా ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది.

వాటిలో కింది స్థాయిలో ఉన్న పోలీస్‌స్టేషన్ల నుంచి హైదరాబాద్‌లోని కమిషనరేట్‌ వరకు అన్ని ఠాణాల ఆధునీకరణ, టెక్నా లజీ యంత్ర అమలు, ట్రాఫిక్‌ ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్, కంట్రోల్‌ రూములు, అత్యాధునిక వాహనాలు, వినూత్నమైన యాప్స్, సిబ్బందికి వసతి ఏర్పాట్లు వంటి అనేక నూతన కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నూతన భవనాల నిర్మాణం ఇంకా పెండింగ్‌లో ఉండటం, కొన్ని చోట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఈ సారి త్వరితగతిన భవన నిర్మాణాలు వేగవంతం చేసేందుకు బడ్జెట్‌ కేటాయింపులు చేయాలని కోరుతున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఈ సారి కొత్తగా ప్రతీ జిల్లా, కమిషనరేట్‌లో టెక్నాలజీతో కూడిన సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కోరనున్నట్లు తెలిసింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఏటా ప్రతిపాదించినట్లు రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు