గొర్రెల కాపరి హత్య కేసులో నిందితులు అరెస్టు

21 Jan, 2015 17:00 IST|Sakshi

కరీంనగర్ క్రైం: జల్సాలకు అలవాటుపడి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ముఠాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారం రోజుల కిందట గొర్రెల కాపరి కొమరయ్యను హత్య చేసి 90 గొర్లను ఎత్తుకుపోయిన శంషొద్దీన్ గ్యాంగ్‌లోని ఏడుగురు సభ్యులను పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లోని ఐదుగురు 22 ఏళ్ల లోపు వారే ఉండటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం... కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో మటన్‌షాపుల్లో పనిచేసే కొందరు యువకులు తాగుడుకు అలవాటు పడి అక్రమంగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

భారీ చోరి చేయాలని నిర్ణయించుకున్న సమయంలో వారికి శంషొద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. కొమరయ్య గొర్రెలను ఎత్తుకెళ్తే డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని శంషొద్దీన్‌ ఆ యువకులకు చెప్పాడు. ఈ నెల 13న కొమరయ్య వద్దకు వెళ్లి గొర్రెల కోసం బేరం చేశారు. అదును చూసి అతణ్ని హత్యచేసి, 90 గొర్రెలను ఎత్తుకెళ్లారు. వాటిని పశువుల సంతలో అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నాం అని పోలీసులు చెప్పారు. ఈ కేసులో శంషొద్దీన్‌తో పాటు మరో ఏడుగురిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

 

మరిన్ని వార్తలు