రూ. లక్ష దాటితే చిక్కే!

27 Oct, 2018 03:18 IST|Sakshi

     ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

     భారీ మొత్తం తరలిస్తే స్వాధీనానికి అవకాశం

     ఆ మొత్తానికి లెక్కలు చూపిస్తేనే వదిలిపెట్టేది

     లేదంటే ఆదాయపుపన్ను శాఖకు అప్పగింత

     ఎన్నికల లింకు ఉన్నట్లయిౖతే పోలీసు కేసు సైతం

సాక్షి, హైదరాబాద్‌: అసలే ఎన్నికల సమరం... లెక్కలకు చిక్కకుండా నల్లధనం బుసలుకొట్టే సమయం... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నాయకులు కోట్లు కుమ్మరించడానికీ వెనుకాడని తరుణం... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఏ స్థాయిలో నిఘా ఏర్పాటు చేసినా నగదు రవాణా జరిగిపోతూనే ఉంటుంది. దీనికి చెక్‌ పెట్టడానికి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. లక్షకు మించి లెక్కలు లేని నగదు తరలిస్తుంటే కచ్చితంగా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డబ్బు పట్టుబడుతోంది. తమ అవసరాల కోసం నగదు తీసుకువెళ్తున్న సామాన్యులు ఇలాంటి చిక్కుల్లో పడకుండా ఉండాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 

అవి ఏమిటంటే... 
- ఎన్నికల సీజన్‌ ముగిసే వరకు సామాన్యులు వీలైనంత వరకు పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్లకపోవడమే ఉత్తమం. 
తనిఖీలు, సోదాల నేపథ్యంలో పోలీసులకు రూ. లక్ష లేదా దానిలోపు నగదు లభిస్తే ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అంతకుమించి కనిపిస్తే ఆ మొత్తానికి లెక్కలు అడుగుతారు. అవి చూపించలేని సందర్భంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపుపన్ను శాఖకు (ఐటీ) అప్పగిస్తారు. 
అనుమానాస్పద స్థితిలో ఎవరి వద్దనైనా రూ. లక్ష లభించినా స్వాధీనం చేసుకుని ఐటీ అధికారుల వద్దకు పంపిస్తారు. అధికారులు తమ విచారణలో సంతృప్తి చెందితే లభించిన మొత్తంపై పన్ను, జరిమానా కట్టించుకున్నాకే మిగిలినవి తిరిగి ఇస్తారు. 

నగదు తప్పనిసరి అయితే ఇలా... 
నగదు తరలింపునకు ప్రత్యామ్నాయంగా చెక్కులు జారీ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా నగదు తమ ఎదుటి వారి ఖాతాలో జమ కావడానికి సమయం పడుతుందని భావిస్తే బ్యాంకుల నుంచి డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు తీసుకునే అవకాశమూ ఉంది. 
ఇది ఖర్చుతో కూడుకున్నదని భావిస్తే అవకాశం ఉన్న వారు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్, ఆర్టీజీఎస్, నిఫ్ట్‌ వంటి సౌలభ్యాలను ఉపయోగించుకోవచ్చు. వాటికి అయ్యే ఖర్చు నామమాత్రమే. 
తప్పనిసరి పరిస్థితుల్లో నగదునే తీసుకువెళ్లాల్సి వస్తే బ్యాంకు స్టేట్‌మెంట్, డ్రా చేయడానికి ఉపకరించిన పత్రాలను వెంట ఉంచుకోవాలి. 
రూ. 10 లక్షలకు మించి తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్లో బ్యాంకు అధికారులకు విషయం చెప్పి వారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. 
కొద్ది రోజుల ముందే డ్రా చేసిన డబ్బును ఇప్పుడు తీసుకువెళ్తుంటే బ్యాంక్‌ పాస్‌బుక్, స్టేట్‌మెంట్‌ వెంట ఉంచుకోవాలి.

ఆ అత్యుత్సాహంపై విమర్శలు...
ఏదైనా క్రిమినల్‌ కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన నిందితుడిని దోషిగా తేలే వరకు మీడియా ముందుకు తీసుకురాకూడదు అనేది ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న అంశం. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు నిర్వహిస్తున్న సోదాల్లో ‘లెక్కలు లేని’సొమ్ముతో దొరికే వ్యక్తులకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎలా బయటపెడుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనుమానాస్పదంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకునే అధికారం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని 102 సెక్షన్‌ ప్రకారం పోలీసులకు ఉంది. అదే ఆదాయపుపన్నుశాఖ అధికారులైతే ఐటీ యాక్ట్‌లోని 132 సెక్షన్‌ కింద స్వాధీనం చేసుకుంటారు. ఆపై అనుమానితుడు ఆ సొమ్ముకు లెక్కచూపిస్తే తిరిగి అప్పగిస్తారు. ఈలోగా పోలీసులు చేస్తున్న హడావుడి కారణంగా వారి పరువు బజారున పడుతోంది. ఈ నేపథ్యంలో తనిఖీల్లో పట్టుబడిన సొత్తు, సొమ్ము అక్రమమని తేలితే తప్ప మీడియా ముందుకు అనుమానితులను తీసుకురాకపోవడం ఉత్తమమనే వాదన వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు