రాజీవ్‌నగర్‌లో పోలీసుల తనిఖీలు

28 Apr, 2018 11:09 IST|Sakshi
తనిఖీలో పాల్గొన్న అధికారులు

సత్తుపల్లి : శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు సత్తుపల్లిలోని రాజీవ్‌నగర్‌ను ఒక్కసారిగా పోలీసులు చక్రబంధంలో బంధించారు. ఉదయం 7.30 గంటల వరకు 488 ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఒక్కసారిగా పోలీసులు వచ్చేసరికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఒక్కొక్క ఇంటిలోకి వెళ్లి ఆధార్‌ కార్డులను, వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు. కొన్ని ఇళ్ళలోని సూట్‌ కేసులు, బట్టల మూటలను తెరిపించి మరీ తనిఖీ చేశారు. రాజీవ్‌నగర్‌ మొత్తం రెండు గంటల్లో జల్లెడ పట్టారు. ఒకరి వద్ద రెండు ఆధార్‌ కార్డులు ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  
పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలతో..  
ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశాలతో రాజీవ్‌నగర్‌లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్‌ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. డివిజన్‌లోని సత్తుపల్లి పట్టణ, రూరల్‌ సీఐలు ఎం.వెంకటనర్సయ్య, మడతా రమేష్‌ గౌడ్, ఎస్‌ఐలు నరేష్‌బాబు, వెంకన్న, నాగరాజు, నరేష్, పవన్‌కుమార్, ఎక్సైజ్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌లతోపాటు 100 మంది పోలీసులు పాల్గొన్నారు.  
వాహనాల స్వాధీనం.. 
కార్డన్‌ సెర్చ్‌లో అప్పటికప్పుడు సరైన ధ్రువపత్రాలు చూపించని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 44 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఒక కారును సీజ్‌ చేశారు. వీటిలో ఇన్సురెన్స్, లైసెన్స్, ఆర్‌సీ బుక్‌ లేని వాహనాలున్నాయి.  అయితే సరైన పత్రాలు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువస్తే వాహనాలను తిరిగి వహనదాలకే ఇచ్చేస్తామని కల్లూరు ఎసీపీ బల్లా రాజేష్‌ స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు