చైనాతో ఘర్షణ.. ట్రైనింగ్‌‌ కాలేజీ కీలక నిర్ణయం!

27 Jun, 2020 15:44 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఆ దేశ వస్తువులను నిషేదించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రాగన్‌ దేశపు వస్తువులు, మొబైల్‌ అప్లికేషన్లను బహిష్కరించింది. తమ కాలేజీలో శిక్షణలో ఉన్న ట్రైనీ పోలీసులకు ఈ మేరకు సూచనలిచ్చింది. గల్వాన్‌ ఘటన నేపథ్యంలోనే ఈమ కాలేజీలో ఉన్న ట్రైనీ కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్ల, ఎస్‌ఐలు చైనాకు చెందిన వస్తువులు, యాప్స్‌ని బాయ్‌కాట్‌ చేశారని కాలేజీ ప్రిన్సిపల్‌ జి.చంద్రమోహన్‌ శనివారం తెలిపారు. దీనికి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవని, అందరం స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు.
(చదవండి: రుగ్వేద కాలం నుంచే అంటురోగాలు)

చైనా ఉత్పత్తులపై ఆధారపడకుండా భారత్‌ స్వశక్తిగా ఎదగాలని ఆయన ఆకాక్షించారు. కాగా, కాలేజీ ప్రవేశద్వారం వద్ద ‘ఈ కాలేజీలో చైనా యాప్‌లు, ఉత్పత్తులు నిషేదించబడ్డాయి’ అని బ్యానర్‌ కూడా పెట్టారు. ఇక్కడ 880 మంది ట్రైనీలు, 150 మంది సిబ్బంది ఉన్నారు. కాగా, జూన్‌ 15 రాత్రి చైనాతో జరిగిన ఘర్షణల్లో కల్నల్‌ సంతోష్‌బాబుతో సహా 21 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఇక చైనా యాప్స్‌లో పాపులరైన టిక్‌టాక్‌ను డిలీట్‌ చేయాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే యూజర్లకు శుక్రవారం పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది చైనీస్‌ యాప్స్‌ను వాడుతున్నట్టు వెల్లడైంది.
(వైరల్‌ : భలే గమ్మత్తుగా పోలీస్‌ ట్రైనింగ్‌)

మరిన్ని వార్తలు