మన్యంలో అలజడి..

14 Jul, 2020 08:11 IST|Sakshi
అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌

పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్న మావోలు  

రాష్ట్ర కమిటీ సభ్యుడితో సహా మరో నలుగురు పరారీ

గూడాల్లో పట్టుకు కేబీఎం దళం ప్లాన్‌

తిర్యాణి అడవుల్లో జల్లెడ పడుతున్న పోలీసులు

స్థానిక గిరిజనుల్లో కలకలం రేపిన ఘటన

సాక్షి, ఆసిఫాబాద్‌: ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం గుండాల అటవీ ప్రాంతంలో దళ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో విస్తృతంగా పోలీసు ప్రత్యేక బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న క్రమంలో మావోయిస్టుల జాడ కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన దళ సభ్యులు పోలీసు బలగాల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయం కుమురం భీం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణువారియర్‌ ధ్రువీకరించారు. (జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు)

తప్పించుకున్న వారిలో సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు మైలవరపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, కేబీఎం (కుమురం భీం మంచిర్యాల ఏరియా) సభ్యుడు వర్గేష్‌ కోయ అలియాస్‌ మంగులుతో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్‌లో విప్లవ సాహిత్యం, మావోయిస్టు యూనిఫాంలు, ఎలక్ట్రానిక్‌ పరికాలు, డిటోనేటర్లు, కార్డెక్స్‌ వైర్లు, పాలిథిన్‌ కార్పెట్స్‌ లభ్యమయ్యాయి. రూ.20లక్షల రివార్డు ఉన్న మైలారపు అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చెర గ్రామం కాగా, వర్గేష్‌ ది చత్తీస్‌ఘడ్‌ ప్రాంతం. ఈయనపై రూ.5లక్షల రివార్డు ఉంది. 

పక్కా సమాచారంతో దాడులు.. 
గత రెండు నెలలుగా కుమురం భీం జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్, తిర్యాణి అటవీ ప్రాంతంలో కేబీఎం దళ సభ్యులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసు శాఖకు అందింది. దీంతో స్పెషల్‌ పార్టీతో పాటు స్థానిక పోలీసులతో రాత్రింబవళ్లు అడవుల్లో జల్లెడ పడుతున్నా రు. గత నెల 28న దళ సభ్యులకు అన్నం పెట్టివస్తున్న ఓ వ్యక్తిని ఆసిఫాబాద్‌ మండలం మోవాడ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో స్థానిక ఆదివాసీల గూడాలపై, సానుభూతి పరులపై మరింత దృష్టి సారించి కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసు బలగాల రాకను పసిగట్టి అక్కడి నుంచి మావోలు తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మంగీ, గుండాల, ఉట్ల పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వారు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

అడవుల్లోనే మకాం..  
కరోనా సంక్షోభంలో పోలీసు యంత్రాంగం బిజీగా ఉన్న సమయంలో మహారాష్ట్ర సరిహద్దుల నుంచి జిల్లాలోకి మా వోలు అడుగుపెట్టినట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇన్నాళ్లు చత్తీస్‌గడ్‌లోని దండాకారణ్యంలో ఉన్న దళం మళ్లీ స్థానికంగా పట్టుపెంచుకునేందుకే వచ్చినట్లు పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక యువతను ఉద్యమబాట పట్టించేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. 

పట్టుపెంచుకునేందుకేనా..?
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే మిలిటెంట్‌ దాడులకు ప్రసిద్ధిగాంచిన మంగీ దళం పూర్తిగా కనుమరుగైంది. 2016లో దళ సభ్యుడు ఆత్రం శోభన్‌ అలియాస్‌ చార్లెస్‌ పోలీసు ఎన్‌కౌంటర్లో మృతి చెందిన తర్వాత ఇక్కడ మావోల అలజడి కనిపించలేదు. జిల్లా పునర్విభన తర్వాత మంచిర్యాల కుమురం భీం ఏరియా (కేబీఎం)కి సారథ్యం వహిస్తూ.. స్థానికంగా పట్టున్న మైలరపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌తో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి బండి ప్రకాశ్, అలియాస్‌ ప్రభాత్‌తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు.

వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తమ ఉనికిని చాటేందుకు మావోలు ఓ దాడికి కూడా యత్నించినట్లు సమాచారం. ఇటీవలే గిరిజన ప్రాంతంలో యువతీ యువకులు అదృశ్యమైన సంఘటనలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వీరంతా ఉద్యమబాట పట్టారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు