‘ప్రగతి నివేదన’కు ఇప్పటివరకు నో పర్మిషన్‌..!

1 Sep, 2018 00:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ సెప్టెంబర్‌ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు పోలీసులు ఇప్పటివరకు అనుమతివ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సభకు అనుమతిచ్చే విషయం రాచకొండ పోలీసు కమిషనర్‌ పరిశీలనలో ఉందని తెలిపింది. చట్టానికి లోబడే అనుమతిపై నిర్ణయం ఉంటుందని పేర్కొంది. సభ విషయంలో రాచకొండ కమిషనర్‌ ఏ ఉత్తర్వులు జారీ చేసినా వాటిని కోర్టు ముందు ఉంచుతామని పేర్కొంది. ప్రగతి నివేదన సభ వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అత్యవసర సర్వీసులకు విఘాతం లేకుండా డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించింది.

ఈ వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు.. ప్రగతి నివేదన సభకు అనుమతి విషయంలో రాచకొండ పోలీసులు తీసుకునే నిర్ణయాన్ని తమ ముందుంచేందుకు వీలుగా తదుపరి విచారణను సెప్టెంబర్‌ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్‌ఎస్‌ దాదాపు రూ.200 కోట్లు వెచ్చించి కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోందని, దాదాపు 25 లక్షల మందికిపైగా జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో సభకు ఇచ్చిన అనుమతులను చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిం చాలంటూ నడిగడ్డ పర్యావరణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

సభ ఆదివారం కదా.. ఇబ్బందేంటి? 
ఈ సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.శశికిరణ్‌ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే పనిచేస్తోందన్నారు. ఇంత స్థాయిలో వస్తున్న జనం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. అత్యవసర సేవలకు కూడా విఘాతం కలిగే ప్రమాదం ఉందని, ఇవన్నీ పట్టించుకోకుండా పోలీసులు సభ నిర్వహణకు అనుమతినిచ్చారని తెలిపారు. ఈ సమయంలో సభ జరిగేది ఏ వారమని ధర్మాసనం అడగ్గా.. ఆదివారం అని శశికిరణ్‌ బదులిచ్చారు. అయితే ఇబ్బంది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజారక్షణ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని శశికిరణ్‌ విన్నవించారు.  

వారే కోర్టుకు వచ్చేవారు కదా..! 
ఈ సభకు అవసరమైన భూములను సంబంధిత భూ యజమానుల నుంచి బలవంతంగా తీసుకున్నారని వివరించారు. మరి బలవంతంగా తీసుకుని ఉంటే ఆ భూముల యజమానులే కోర్టుకు వచ్చే వారు కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. సభ వల్ల అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ నుంచి స్పష్టత కోరింది. రాజధానికి వెలుపల 31 కిలోమీటర్ల దూరంలో సభ జరుగుతోందని శరత్‌కుమార్‌ కోర్టుకు నివేదించారు. ఈ సభ వల్ల హైదరాబాద్‌కు వచ్చే.. హైదరాబాద్‌ నుంచి వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ సభ వల్ల ఎవరికీ అసౌకర్యం, ఇబ్బంది కలగబోదని హామీ ఇస్తున్నట్లు నివేదించారు. 

జన సమీకరణే ప్రతి పార్టీ లక్ష్యం.. 
‘ప్రతి రాజకీయ పార్టీ కూడా సభలు పెట్టుకుంటుంటాయి. ఆ సభలకు పరిమిత సంఖ్యలో జనం రావాలని ఏ పార్టీ అయినా చెప్పిందా.. భారీ జన సమీకరణ చేయడమే ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం.’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సభ జరిగే ప్రాంతం ఏ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వస్తుందని ధర్మాసనం ప్రశ్నించగా, రాచకొండ పరిధిలోకి వస్తుందని శరత్‌ చెప్పారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సెంచరీ కాదు.. ఎన్ని వికెట్లు పోతాయో చూస్కో’

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

ఉత్తమ్‌కు టీపీసీసీ పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష : కేటీఆర్‌

ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

‘టైం, ప్లేస్‌ చెప్పు.. వచ్చేందుకు నేను రెడీ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సల్మాన్‌ సినిమా అయితే రూ. 500 కోట్లు..’

రానా చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్‌

ప్రతినాయక పాత్రలకు సిద్ధం : బాలకృష్ణ

అక్టోబ‌ర్ 5న ‘ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌’

రాజమౌళి మల్టీస్టారర్‌పై మరో అప్‌డేట్‌

2.ఓ టీంకు డెడ్‌లైన్‌..!