బాలుడిపై పోలీసుల ప్రతాపం

2 Mar, 2015 04:14 IST|Sakshi
బాలుడిపై పోలీసుల ప్రతాపం

- 12 గంటలపాటు నేరస్తులతో కలిపి మొద్దుకు కట్టేసిన ఖాకీలు


వర్ధన్నపేట: ఐదో తరగతి చదువుతున్న ఓ పసి బాలుడిపై వర్ధన్నపేట పోలీసులు కర్కశత్వాన్ని చాటారు. నేరస్తులు, హంతకులు, దుండగులను ఇంటరాగేషన్‌లో శిక్షించేలా మొద్దుకేసి రాత్రంతా ఉంచారు.  బాలుడి కథనం ప్రకారం.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన బాలుడు గంధం వీరన్న స్థానిక గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలసి ఓ కిరాణషాపునకు వెళ్లాడు. ఆ షాపు షట్టర్ సగం వేసి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా ఎవరూ లేరు. పిలిచినా పలకలేదు. ఈ క్రమంలో వీరన్న వెంట ఉన్న బాలురు బయటకు వచ్చి షట్టర్ లాగి వెళ్లిపోయారు.  
 
షాపు షట్టర్ తెరవమని వీరన్న అరుస్తుండగానే పక్కనే ఉన్న ఓ వ్యక్తి షట్టర్ తీసి ఇక్కడ ఏమి చేస్తున్నావని ప్రశ్నించగా.. జరిగిన విషయం తెలిపారు. ఇంతలో షాపు యజమాని వచ్చి వీరన్న జేబులో ఉన్న 300 రూపాయలను తీసుకొని  పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ బాలుడిని స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న వార్డెన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాలుడిని హాస్టల్‌కు తీసుకెళతామన్నా విడిచిపెట్టలేదు. చేసేదేమీలేక ఆ బాలుడికి ఆహారం, దుప్పటి ఇచ్చారు.  రాత్రంతా బాలుడిని స్టేషన్‌లో నేరస్తులతో కలిపి మొద్దును కాళ్లకు బిగించి తాళాలు వేశారు. ఆదివారం ఉదయం  వీరన్నను వార్డెన్ జామీనుపై విడిపించి హాస్టల్‌కు తీసుకెళ్లారు.  ఈ విషయంపై పోలీసులు నోరు మెదపడం లేదు. ఈ విషయమై బాలలహక్కుల సంఘం అధ్యక్షులు అనురాధారావు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఫిర్యాదు చేయగా, బాధ్యుడైన ఎస్సైని సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు