మహిళల భద్రతకు ‘హక్‌ ఐ’

11 Jun, 2019 15:07 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: మహిళలు ఎక్కడైన ఇబ్బందులు పడుతున్నారా.. ప్రయాణ సమయంలో భద్రత లేదా..అత్యవసర సమయాల్లో ఎక్కడున్నా పోలీసులు స్పందించాలా..మన కళ్ల ముందు ఎదైనా సంఘటన జరిగిందా.. మనమెవరో తెలియకుండా ఆ సంఘటనను పోలీసులకు తెలియజేయాలా..వీటిన్నింటికీ ఒకటే సమాధానం హక్‌ఐ యాప్‌. యాప్‌ డౌన్‌లోడు చేసుకుని మరెన్నో పోలీస్‌ సేవలను పొందవచ్చు. హక్‌ ఐ.. కరీంనగర్‌ కమిషనరేట్‌ కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 2017 జనవరి 14న యాప్‌ సేవలను పోలీస్‌శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. మన ఇంటివద్దనే కూర్చుని పోలీసుల సేవలను పొందేందుకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా హక్‌ ఐ రూపొందించామని సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రస్తుతం యాప్‌పై ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ఎదైనా ఫిర్యాదు చేయాలంటే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీస్‌ అధికారి వచ్చే వరకూ ఉండి ఫిర్యాదు చేసే విదానం ఉండేది. కాని ఈ యాప్‌ ద్వారా ఎక్కడినుంచైనా తగిన ఆధారాలతో నేరుగా సంబంధిత ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయొచ్చు. ముఖ్యంగా మహిళలు, కాలేజీ విద్యార్థినులు ఠాణాకు వెళ్లకుండానే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. మనం చేసిన ఫిర్యాదుపై తీసుకుంటున్న చర్యలను యాప్‌లోనే చూసుకోవచ్చు. జిల్లాలో హక్‌ఐ అప్లికేషన్‌ను ఇప్పటి వరకూ 65 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇప్పటి వరకూ 2,736 ఫిర్యాదులు రాగా అన్నింటినీ పరిష్కరించారు. 

డౌన్‌లోడ్‌ ఇలా..
ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగదారులు గూగూల్‌ ప్లే స్టోర్‌ నుంచి, ఐఓఎస్‌ వినియోగదారులు ఆపిల్‌ స్టోర్‌ నుంచి హక్‌ఐ అని టైప్‌ చేసి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ తర్వాత అందులో మన వివరాలు నమోదు చేస్తే అన్ని కమిషనరేట్ల వివరాలు వస్తాయి. అందులో కరీంనగర్‌ కమిషనరేట్‌ అని ఎంచుకోవాలి. హక్‌ఐ తెరపై ఎనిమిది ఐకాన్‌లు కనిపిస్తాయి. వాటిలో రిపోర్ట్‌ వాయిలేషన ఆఫ్‌ పోలీస్, ఉమెన్‌ ట్రావేల్‌ మోడ్‌ పేఫ్, రిజిస్ట్రర్‌ విత్‌ పోలీస్, ఎస్‌ఓఎస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, కమ్యూనిటీ పోలీసిం గ్, నో యువర్‌ రిపోర్ట్‌ స్టేటస్, వెహికల్‌ అండ్‌ నంబర్‌ సెర్చ్‌.. ఇవి వివిధ రకాల వినియోగదారులకు ఉపయోగపడుతాయి. 

ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు..
ఈ అప్లికేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై పోలీస్‌శాఖ ప్రత్యేక శ్రద్ధోతో చర్యలు తీసుకుంటుంది. ఫిర్యా దు అందగానే బాధితులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో తొందరగా స్పందించడంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వరకు 2,736 ఫిర్యాదులు రాగా దాదాపు అన్నింటినీ పరిష్కరించారు. 

హక్‌ ఐకి వచ్చిన ఫిర్యాదుల వివరాలు

  • ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు–759 
  • అక్రమ కార్యకలాపాలకు సంబంధించినవి – 254,
  • ఇతర నేరాలు, మహిళల వేధింపులకు     సంబంధించినవి – 658 
  • ఉమెన్‌ ట్రావెల్‌ సేవ్‌ మోడ్‌ వినియోగించుకున్న వారి సంఖ్య– 638  
  • అత్యవసర పరిస్థితులపై ఫిర్యాదులు (ఎస్‌ఓఎస్‌) – 427.  వీటిలో సుమారు 102 వరకూ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 

ప్రతీ పౌరుడు యూనిఫాం లేని పోలీసే.. 

ప్రతి ఒక్కరూ హక్‌ఐ యాప్‌ను వినియోగించుకోవాలి. ఈ యాప్‌తో పోలీస్‌స్టేషన్‌కు రాకుండానే ఫిర్యాదు చేయొచ్చు, అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. దీనిపై కాలేజీల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ప్రజలు చేసిన ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం, తీసుకుంటున్న చర్యలను కూడా ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు.  
   – వీబీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌

అవగాహన కల్పిస్తున్నాం

విద్యార్థినులకు, మహిళలకు హక్‌ఐ యాప్‌ ద్వారా లభించే సేవలపై అవగాహన కల్పిస్తున్నాం. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారు దీనికి డౌన్‌లోడు చేసుకునేందుకు వీలుగా సేవలందిస్తున్నాం. యాప్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరిస్తున్నాం. 
– దామోదర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్, మహిళాపోలీస్‌స్టేషన్, షీటీం  

మరిన్ని వార్తలు