ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..

20 Aug, 2019 10:54 IST|Sakshi
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు 

సాక్షి, నాగర్‌కర్నూల్‌ క్రైం : నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై.. మరణిస్తే ఆ కుటుంబంలో తీరని వేదన మిగలడంతోపాటు కుటుంబ పెద్దను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు ప్రమాదాల నివారణ కోసం కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో అధికారులతో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రమాదకరమైన రహదారులను,  డేంజర్‌ స్పాట్లను, గుర్తించడంతోపాటు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే రహదారుల్లో నివారణ కోసం రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తూ.. నిరంతరం పోలీస్‌ వాహనాలతో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.. 

సూచిక బోర్డుల ఏర్పాటు 
నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే 20 డేంజర స్పాట్లను అధికారులు గుర్తించారు. ఈ డేంజర్‌ స్పాట్లలో పోలీసులు, రవాణా శాఖాధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలు, పరిమితికి మించి ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు వాహనాలు, మోటారు వాహన చట్టాలను ఉల్లఘించే వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు జరిమానాలు విధిస్తున్నారు. అధికారులు గుర్తించిన డేంజర్‌ స్పాట్లలో ఎక్కువగా రోడ్డు మలుపులు ఉన్న ప్రాంతాలు, శ్రీశైలం హైద్రాబాద్‌ ప్రధాన రహదారిలో, శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు చోటచేసుకోకుండా ఉండటం కోసం సూచిక బోర్డులు, అవసరమైన చోట్ల స్టాపర్లు ఏర్పాటు చేస్తున్నారు. 

తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు 
నాగర్‌కర్నూల్‌ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత ఎస్పీ కార్యాలయం, రవాణా శాఖ కార్యాలయాలను  ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎస్పీ, జిల్లా రవాణాశాఖ అధికారిని నియమించారు. దీంతో పోలీస్, రవాణా శాఖాధికారులు రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించడంతో ప్రమాదాలు ఏటేటా తగ్గుముఖం పట్టాయి. 2016     సంవత్సరంలో  రోడ్డు ప్రమాదాలు 136    సంభవించగా    155 మంది మృత్యువాత పడ్డారు. సాధారణ రోడ్డు ప్రమాదాలు 194 జరగగా 366 మంది గాయాలపాలయ్యారు. 2017 సంవత్సరంలో 132 రోడ్డు   ప్రమాదాలు చోటుచేసుకోగా 140 మంది మృత్యువాత పడ్డారు. 356 సాధారణ రోడ్డు    ప్రమాదాలు  జరగగా 594 మంది గాయపడ్డారు.  2018 సంవత్సరంలో 121 రోడ్డు    ప్రమాదాలు చోటుచేసుకోగా 129 మంది    మృత్యువాత  పడ్డారు. సాధారణ రోడ్డు ప్రమాదాలు 235 చోటుచేసుకోగా 558 మంది గాయపడ్డారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పదుల సంఖ్యలో నమోదనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

జాగ్రత్తలు పాటిస్తే..  
వాహనదారులు చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ముఖ్యంగా తాగి వాహనాలను నడిపే వారి వల్ల, ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో భారీగా ప్రాణనష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తాగి, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయకూడదు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉండటంతో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదు. వాహనడ్రైవర్లు ఎక్కువ గంటలు వాహనాలను నడపడం వల్ల అలసిపోయి నిద్రలోకి జారుకొని అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. డ్రైవర్లు అలసిపోయే వరకు ఎక్కువ గంటలపాటు వాహనాలను నడపకూడదు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. 

ప్రత్యేకంగా దృష్టిసారించాం..
నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే 20 చోట్ల డేంజర్‌ స్పాట్లను గుర్తించాం. ఆయా చోట్ల ప్రమాదాలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టాం. అలాగే మోటారువాహన చట్టాలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. 
– ఎర్రిస్వామి, జిల్లా రవాణా శాఖాధికారి, నాగర్‌కర్నూల్‌ 

మరిన్ని వార్తలు