‘ప్రగతి నివేదన సభ’ రూట్‌ మ్యాప్‌ ఇదే!

30 Aug, 2018 03:50 IST|Sakshi
ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి సభా స్థలికి వేసిన కనెక్టివిటీ రోడ్డు

     సభకు వచ్చిపోయే రూట్‌లపై స్పష్టత ఇచ్చిన పోలీస్‌ శాఖ 

     సభాస్థలికి చేరుకునేందుకు 7 మార్గాలు 

     ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వారికి అనుకూలంగా ఏర్పాట్లు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రగతి నివేదన సభకు ఎక్కడి నుంచి రాకపోకలు సాగించాలనే దానిపై పోలీసు శాఖ స్పష్టతనిచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌లో సెప్టెంబర్‌ 2న నిర్వహించే భారీ బహిరంగ సభకు రూట్‌ మ్యాప్‌ను విడుదల చేసింది. 25 లక్షల మంది తరలిరానున్న నేపథ్యంలో పోలీసు శాఖ.. సభాస్థలికి చేరుకోవడానికి 7 మార్గాలను ఏర్పాటు చేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల కార్యకర్తలు రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉండటానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డును ప్రధాన రహదారిగా ఎంచుకున్నారు.
 
ఎవరెలా రావాలంటే.. 
- విజయవాడ హైవే నుంచి వచ్చే వాహనాలు పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ క్రాస్‌ రోడ్స్‌–కోహెడ–మంగల్‌పల్లి క్రాస్‌ రోడ్స్‌ మీదుగా కొంగర కలాన్‌కు చేరుకోవాలి.  
దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఇబ్రహీంపట్నం శివారు నుంచి ఎలిమినేడు మీదుగా సభాస్థలికి వెళ్లాలి.
శ్రీశైలం హైవే మీదుగా వచ్చే వాహనాలు కందుకూరు మండలం రాచులూరు గేటు నుంచి వయా తిమ్మాపూర్‌ నుంచి రావాలి.
బెంగళూరు జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలు శంషాబాద్‌ మండలం పాల్మాకుల నుంచి స్వర్ణభారతి ట్రస్ట్‌ మీదుగా పెద్ద గోల్కొండ రోడ్డులో ఫ్యాబ్‌ సిటీ నుంచి సభా ప్రాంతానికి రావాలి.
నాగ్‌పూర్‌ హైవే మీదుగా వచ్చే వాహనాలు ఔటర్‌ మీదుగా బొంగ్లూరు జంక్షన్‌ దగ్గర దిగి సర్వీసు రోడ్డు ద్వారా సభా ప్రాంగణానికి వెళ్లాలి.
ముంబై నుంచి వచ్చే వాహనాలు గచ్చిబౌలి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదకు చేరుకుని తుక్కుగూడ జంక్షన్‌ వద్ద దిగి ఫ్యాబ్‌ సిటీ మీదుగా చేరుకోవాలి.
ఉమ్మడి వరంగల్, మంథని నుంచి వచ్చే వాహనాలు ఘట్‌కేసర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ ద్వారా బొంగ్లూరు జంక్షన్‌లో దిగి.. సర్వీసు రోడ్డు మీదుగా సభా ప్రాంగణానికి రావాలి.
పాత ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు శామీర్‌పేట ఔటర్‌ మీదుగా బొంగ్లూరు జంక్షన్‌ దగ్గర దిగి సర్వీసు రోడ్డు ద్వారా రావాలి.
సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట్, ఉప్పల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలు సాగర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా మందమల్లమ్మ క్రాస్‌రోడ్స్‌–పహాడీషరీఫ్‌ మార్గంలో వండర్‌లా ద్వారా చేరుకోవాలి.
ఎల్బీనగర్, మలక్‌పేట్‌ సెగ్మెంట్ల నుంచి వచ్చే వాహనాలు సాగర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా మందమల్లమ్మ క్రాస్‌రోడ్స్‌ నుంచి పహాడీషరీఫ్‌ మార్గంలో వండర్‌లా మీదుగా సభకు రావాలి.
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, రాజేంద్రనగర్, కార్వాన్‌ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలు తెలంగాణ పోలీస్‌ అకాడమీ నుంచి ఔటర్‌ మీదుగా తుక్కుగూడ జంక్షన్‌లో దిగి.. ఫ్యాబ్‌ సిటీ మీదుగా రావాలి. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలు పటాన్‌ చెరు ఓఆర్‌ఆర్‌ మీదుగా తక్కుగూడ జంక్షన్‌లో దిగి ఫ్యాబ్‌ సిటీ నుంచి సభా ప్రాంతానికి చేరుకోవాలి.
చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, గోషామహల్, యాకుత్‌పురా నుంచి వచ్చే వాహనాలు చాంద్రాయణగుట్ట నుంచి పహాడీషరీఫ్‌–వండర్‌లా మీదుగా కొంగర కలాన్‌కు రావాలి. 

20 వేల మందికిపైగా పోలీసులు
కనీవిని ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తుండటంతో అందుకు తగ్గట్లుగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులే కాకుండా.. ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పిస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్‌ స్థాయి వరకు అన్ని విభాగాల బలగాలను మోహరిస్తున్నారు. 10 వేల మంది శాంతి భద్రతలు, మరో 10 వేల మంది ట్రాఫిక్‌ పోలీసులను సభ నిర్వహణకు వినియోగిస్తున్నారు. వీరిలో 30 మంది ఐపీఎస్‌ అధికారులు, 100 మంది డీఎస్పీలు, 1,000 మంది సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు, 19,000 పోలీసు సిబ్బంది, 500 మంది మహిళా పోలీసులు బందోబస్తుకు రానున్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్, స్పెషల్‌ పార్టీ బలగాలను కూడా మోహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు