ఎన్నికల బదిలీలు

13 Oct, 2018 12:35 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఎన్నికల సందర్భంగా జిల్లాలో బదిలీలు జరగనున్నాయి. సొంత జిల్లా అధికారులతోపాటు ఇదే జిల్లాలో మూడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు శాఖలో బదిలీల ఫీవర్‌ పట్టుకుంది. ఎన్నికల సమయంలో దీర్ఘకాలికంగా పనిచేసిన అధికారులు ఒకే దగ్గర ఉంటే అభ్యర్థులకు సహకరించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

తొమ్మిది మంది తహసీల్దార్లకు తప్పని బదిలీ
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ ఉన్నతాధికారులు చేపట్టారు. జిల్లాలో తొమ్మిది మంది తహసీల్దార్లకు బదిలీ తప్పేలా లేదు. జిల్లాలో 16 మండలాలుండగా అందులో 9 మంది తహసీల్దార్లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. వచ్చే నవంబర్‌ 30 నాటికి ఒకే జిల్లా పరిధిలో గడిచిన నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు బదిలీ జాబితాను రూపొందించారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తహసీల్దార్లు సరిత(దామెర), హరికృష్ణ(పరకాల), వెంకన్న(ఆత్మకూరు), సుభాషిణి(చెన్నారావుపేట),శ్రీనివాస్‌(గీసుకొండ), రజినీ(ఖానాపూర్‌),  పూల్‌సింగ్‌(నర్సంపేట), కనకయ్య(వర్ధన్నపేట), రాంమూర్తి(రాయపర్తి)కి బదిలీ కానున్నట్లు విశ్వనీయంగా తెలిసింది. రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో స్థానికులు తహసీల్దార్లుగా పని చేయడం లేదు.

పోలీస్‌ శాఖలో ఇప్పటికే పూర్తి
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో బదిలీలు నెల రోజుల క్రితమే పూర్తయ్యాయి. ఇప్పటికే సీఐ, ఏసీపీ, డీసీపీ స్థాయిలో పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. ప్రధానంగా లా అండ్‌ ఆర్డర్‌ పని చేస్తున్న పోలీస్‌ అధికారులను గుర్తించి లూప్‌ లైన్‌కు పంపించారు. గత నెలలో పోలీస్‌ శాఖలో బదిలీలు కావడంతో మళ్లీ ఉండకపోవచ్చు తెలుస్తోంది. పోలీసు శాఖ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో తమకు అనుకులమైన పోలీసు అధికారులను టీఆర్‌ఎస్‌కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు  బదిలీలు చేయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు