‘పచ్చబొట్టు’ పట్టేసింది

2 Feb, 2019 08:51 IST|Sakshi
నర్సింహులును కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న ఏసీపీ నారాయణ

కుటుంబం చెంతకు చేరిన మతిస్థిమితం లేని వ్యక్తి 

గజ్వేల్‌: మతిస్థిమితం కోల్పోయిన కారణంగా ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లిన వ్యక్తిని.. చేయిపై వేయించుకున్న పచ్చబొట్టు తిరిగి స్వగ్రామానికి చేరుకునేలా చేసింది. కనిపించకుండా పోయాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం జాలిగామలో ఈ ఘటన చోటు చేసుకుంది. జాలిగామకు చెందిన గంగాల నర్సింహులుకు భార్య యాదమ్మ, కూతురు రేణుకలు ఉన్నారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం అతను మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో ఎప్పుడు, ఎక్కడికి వెళ్లేవాడో తెలిసేది కాదు. కుటుంబ సభ్యులు తరచూ అతని కోసం వెతుకులాడేవారు.

ఇదే క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం అతను రైలెక్కి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లాడు. అక్కడే భిక్షాటన చేస్తూ కాలం గడిపాడు. ఈ తరుణంలో గత నెల 15న సంక్రాంతి సందర్భంగా భోపాల్‌కు చెందిన అన్షుమన్‌ త్యాగి, అతని స్నేహితుడు హిమాన్‌జైన్‌లతోపాటు మరికొందరు యువకులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా భోపాల్‌ రైల్వేస్టేషన్‌ లో పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సింహులు వారికి తారస పడ్డాడు. అప్పటికే అతను కాలికి గాయమై నీరసంగా ఉన్నాడు. చేతిపై లక్ష్మి పేరుతో ఉన్న పచ్చబొట్టును వారు గుర్తించారు. అక్షరాలు తెలుగులో ఉండటం గమనించి అన్షుమన్‌ త్యాగి, హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో నివాసముండే తన బావ రాకేష్‌త్యాగికి ఫోన్‌లో విషయాన్ని వివరించాడు.   పచ్చబొట్టు ఫోటో తీసి వాట్సాప్‌ చేశాడు. అనంతరం నర్సింహులు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు.

కొన్ని రోజుల తర్వాత కోలుకున్న నర్సింహులు తమది గజ్వేల్‌ ప్రాంతమని, భార్య పేరు యాదమ్మ అని చెప్పుకొచ్చాడు. ఈ వివరాల గురించి త్యాగి.. గుగూల్‌లో సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ నంబర్‌ తీసుకొని సమాచారమిచ్చాడు. దీంతో గజ్వేల్‌ ఏఎస్‌ఐ జగదీశ్వర్‌ జాలిగామ గ్రామానికి వెళ్లి నర్సింహులు ఫొటో తీసుకెళ్లి విచారణ జరపడంతో తమ గ్రామస్తుడేనని తెలిపారు. శుక్రవారం నర్సింహులును భోపాల్‌ నుంచి అన్షుమన్‌ త్యాగి సాయంతో ఇక్కడకు రప్పించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పచ్చబొట్టు ఆధారంగా తిరిగి నర్సింహులు తమవద్దకు చేరుకోవడంతో కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్షుమన్‌ త్యాగి, హిమాన్‌ జైన్, రాకేశ్‌త్యాగిలను ఏసీపీ అభినందించారు.  

మరిన్ని వార్తలు