భద్రతకు భరోసా

6 Nov, 2014 00:49 IST|Sakshi
భద్రతకు భరోసా

* పోలీసుకు మొదటిసారిగా ప్రణాళికా బడ్జెట్      
* జంట కమిషనరేట్లకు రూ. 186 కోట్లు కేటాయింపు    
* నగరానికి రూ. 116 కోట్లు,సెబరాబాద్‌కు రూ. 70 కోట్లు

సాక్షి, సిటీబ్యూరో:  పోలీసు శాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బడ్జెట్‌ను అందించింది. జంట పోలీసు కమిషనరేట్లకు కలిపి రూ.186 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించింది. నగరాన్ని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా తీర్చి దిద్దేందుకు ప్రాణాళిక బడ్జెట్ కింద నగర పోలీసు కమిషనరేట్‌కు రూ.116 కోట్లు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు రూ.70 కోట్లు అందించింది. పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ పేర్కొన్నారు.  

ప్రతీ ఏటా నగర పోలీసు శాఖకు ప్రణాళికేతర బడ్జెట్‌ను మాత్రమే ప్రభుత్వం కేటాయించేది. ఈ సారి అలా కాకుండా ప్రణాళికా బడ్జెట్ కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేశా రు.  బంజారాహిల్స్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన నగర పోలీసు ప్రధాన కార్యాలయ భారీ భవనానికి ప్రత్యేకంగా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. దీంతో త్వరలో భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగనున్నాయి.

ఇక ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థకు కూడా పెద్ద పీట వేశారు. ప్రతీ పోలీసు స్టేషన్‌లో ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నేర రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు సీసీటీవీ సర్వెలెన్స్ ప్రాజెక్ట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఏకంగా రూ.69.59 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ట్రాఫిక్ సమస్య నివారణ కోసం కూడా ఇందులో నిధులు కేటాయించారు. అలాగే, నేరాల అదుపు, కరుడు గట్టిన నేరస్తుల ఆట కట్టించేందుకు టెక్నాలజీ అభివృద్దికి కూడా ప్రత్యేకంగా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
 
నగర కమిషనరేట్ కు..
* రూ.20 కోట్లు:  కొత్తగా నిర్మించనున్న కమిషనర్ ప్రధాన కార్యాలయం.
* కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్‌మెంట్
* రూ.20 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్‌లో సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్ ఏర్పాటు
* రూ.44.59 కోట్లు: సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్ట్
* రూ.21.41 కోట్లు: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ మేనేజ్‌మెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్
* రూ.10 కోట్లు-నేరాలు, నేరస్తుల ఆట కట్టించేందు కు సరికొత్త టెక్నాలజీని సమకూర్చుకునేందుకు
 
సైబరాబాద్‌కు...
* కేటాయించింది మొత్తం  రూ.70 కోట్లు
* రూ.25 కోట్లు: సీసీ కెమెరాల ఏర్పాటు
* రూ.45 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్‌లో ఆధునిక రిసెప్షన్ సెంటర్లు, టాయిలెట్స్, బారికేడ్లు,
* గచ్చిబౌలిలోని కమిషనరేట్ భవనంపై అదన ంగా మరో అంతస్తు నిర్మాణం, కమాండ్ కంట్రో ల్ సెంటర్, ఆదిబట్ల, గచ్చిబౌలి, జవహర్‌నగర్, మహిళా పోలీసు స్టేషన్ లకు పక్కా భవనాలు.
 
శుభసూచకం...

పీపుల్స్, పోలీసు, పీస్ (శాంతి), పొగ్రెస్ (అభివృద్ధి)కి ఈ బడ్జెట్ శుభసూచకం. సమాజంలో శాంతి లేనిదే అభివృద్ధి సాధ్యం కాదు. దానికి అధిక ప్రధాన్యత నిస్తూ పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు కేటాయించడం ఆహ్వానించదగ్గ విషయం.  నేను ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పని చేసిన సమయంలో 11 వందల కోట్లు కేటాయించాం. దానితో పోలిస్తే విభజన అనంతరం తొలి బడ్జెట్‌లో తెలంగాణకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారు.  ఇది భవిష్యత్‌లో ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు ఎంతగానే దోహదపడుతుంది. అభివృద్ధి శరవేగంగా సాగడానికి పోలీసు శాఖకు ఈ నిధులు సరిపోతాయి. పీపుల్స్, పోలీసు, పీస్, ప్రొగెస్ (4పి) అనే ఇంగ్లీష్  నానుడికి ఈ బడ్జెట్ ప్రేరణగా ఉంది.    
- పేర్వారం రాములు, మాజీ డీజీపీ
 
ప్రతి పైసా ప్రజల కోసం ఉపయోగిస్తాం...
 ప్రభుత్వం కేటాయించిన రూ.186 కోట్ల నిధులలో ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. పోలీసు స్టేషన్‌లలో సౌకర్యాలు మరింత మెరుగు పరుస్తాం.  నేరాల అదుపుతోపాటు నేరాల మిస్టరీని త్వరగా ఛేదించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. జంట పోలీసు కమిషనరేట్లలో ఉన్న కరుడు గట్టిన నేరస్తులను కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికను తయారు చేస్తున్నాం. పోలీసులకు కావల్సిన వాహనాలు ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. వారికి కావాల్సిన మరికొన్ని పరికరాలు, సౌకర్యాల కల్పిస్తాం.
 - ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్  జంట పోలీసు కమిషనర్లు

మరిన్ని వార్తలు