ఆ ఎన్‌కౌంటర్‌పై సిట్‌ ఏర్పాటు చేయండి

16 Dec, 2017 04:03 IST|Sakshi

మేళ్లమడుగు ఘటన దర్యాప్తును మీరే పర్యవేక్షించండి

హైకోర్టులో పౌర హక్కుల కమిటీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగూడెం జిల్లా టేకు పల్లి మండలం మేళ్లమడుగు పరిధిలో ఈ నెల 14న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది సీపీఐ(ఎంఎల్‌) చండ్ర పుల్లారెడ్డి బాట దళ సభ్యులు మృతి చెందిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, ఆ దర్యాప్తును పర్యవేక్షించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మృతదేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించి, వాటిని భద్రపరిచేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

ఈ వ్యాజ్యంౖ పె అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. అయితే మధ్యాహ్నం నుంచి ఏసీజే నేతృత్వంలో మరో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు కావడంతో ఈ కేసు విచారణకు నోచుకోలేదు. సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే అవకాశం ఉంది. నేలమడుగు ఎన్‌కౌంటర్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ అని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ మృతులంతా సీపీఐ (ఎంఎల్‌) చండ్రపుల్లారెడ్డి బాట దళ సభ్యులని, వీరందరినీ పోలీసులు పట్టుకొచ్చి కాల్చి చంపారన్నారు. మృతదేహాలకు రాత్రివేళ పోస్టుమార్టం నిర్వహించవద్దని మృతుల బంధువులు.. కలెక్టర్, డీఎస్పీని కోరారని, అయితే వారు స్పందించలేదన్నారు. మృతదేహాలను  ఉస్మానియా లేదా వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

మరిన్ని వార్తలు