పిచ్చివాడిపై ఖాకీ ప్రతాపం

12 Nov, 2014 03:49 IST|Sakshi

అశ్వారావుపేట: మద్యం మత్తులో ఓ ఖాకీ మానసిక వికలాంగుపై ప్రతాపం చూపిన ఘటన సోమవారం అర్ధరాత్రి అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ములకలంపల్లికి చెందిన షేక్ వలీ అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా అశ్వారావుపేట పరిసరాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయే అతను ఆ సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే మహిళలపై, పశువులపై, వాహనాలపైకి ఉరుకులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తుంటాడు. పశువులను పోలీస్‌స్టేషన్‌లోకి తోలుతుంటాడు.

పోలీసులను సైతం పేరు పెట్టి తిడుతుంటాడు. ఇతడిని చూస్తే పోలీస్ స్టేషన్ సెంటర్‌లో ఎవరయినా సరే పక్కకు తప్పుకుని వెళ్తుంటారు. ఇతడినే ఉదాహరణగా పేర్కొంటూ ఇలాంటి మానసిక వికలాంగులను ఆస్పత్రికి తరలించాల్సిన బాధ్యత పోలీసులదేనంటూ ‘సాక్షి’లో గతంలో కథనం ప్రచురితమైంది. కానీ చివరకు ఆ పోలీసులే అతని కాలు విరగ్గొట్టారు. సోమవారం రాత్రి 11గంటల సమయంలో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన వలీ బూతుపురాణం మొదలు పెట్టాడు.

 దీంతో స్టేషన్‌లో ఉన్న ఓ పోలీస్ కర్రతో అతని కాలిపై కొట్టడంతో గాయమై తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతను బయటకు వచ్చాడు. అదే సమయంలో అక్కడున్న వ్యాపారులు, స్థానిక యువకులు, విలేకరులు అతనిని అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స చేయించి ఇన్‌చార్జ్ ఎస్సై అబ్దుల్‌ర హీంకు సమాచారం అందించారు. ఎస్సై ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రుడిని పరిశీలించారు. తీరా తెల్లవారిన తర్వాత అతను తిరిగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని హడివిడి చేశాడు. పోలీస్ స్టేషన్ ఎదుటే వాహనాలను నిలిపివేసి కేకలు పెడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.

మరిన్ని వార్తలు