కుర్రాళ్లను కుళ్లబొడిచారు!

21 Dec, 2018 01:53 IST|Sakshi

హైదరాబాద్‌లోని న్యూబోయిన్‌పల్లిలో ఘటన 

పుట్టినరోజుకు వచ్చిన వారిని విచక్షణారహితంగా కొట్టిన పోలీసులు  

హైదరాబాద్‌: పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్‌ విద్యార్థులను గొడవ చేస్తున్నారంటూ పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో చితకబాదారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని న్యూబోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. న్యూ బోయిన్‌పల్లి చిన్నతోకట్ట సేవన్‌ టెంపుల్స్‌ సమీపంలో ఉండే పసుపుల సాయి పుట్టినరోజును పురస్కరించుకుని 18వ తేదీ రాత్రి అతడి ఇంటికి పలువురు విద్యార్థులు వెళ్లారు. అయితే వారు అల్లరి చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి పంపించివేశారు.

తిరిగి మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు 40 మంది విద్యార్థులు సాయి ఇంటికి చేరుకుని పుట్టినరోజు కేక్‌ కట్‌ చేయించి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సమయంలో పెట్రోలింగ్‌ వాహనంలో వచ్చిన కానిస్టేబుళ్లు.. అభిషేక్, పుష్పరాజ్, కళ్యాణ్, భానుప్రకాశ్, భరత్, మనీశ్, శుభం(విద్యార్థులు)లను, పి.సందీప్‌కుమార్, అభిషేక్‌ యాదవ్‌(స్నేహితులు)లను డీసీపీ తీసుకురమ్మన్నారని చెప్పి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారిని సీఐ ఆనంద్‌కిశోర్, ఎస్‌ఐలు శ్రీనివాస్, గురుస్వామిలు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ.. ఒక్కసారిగా వారిపై లాఠీలతో చితకబాదారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు.  

కొట్టలేదు.. కౌన్సిలింగ్‌ ఇచ్చాం: సీఐ ఆనంద్‌ 
పుట్టినరోజు పేరుతో కాలనీలో గొడవ చేస్తున్నారంటూ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ వచ్చిందని, దీంతో ఘటనా స్థలానికి వెళ్లి రోడ్డుపై గుమిగూడిన విద్యార్థులను వెళ్లిపోవాలని సూచించినట్లు సీఐ ఆనంద్‌కిశోర్‌ తెలిపారు. అయితే కొందరు వెళ్లిపోగా.. పోలీసులను రెచ్చగొట్టేలా మాట్లాడటంతో 9 మందిని స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చామని చెప్పారు. అనంతరం వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు రప్పించి అప్పగించామని, విద్యార్థులను తాము కొట్టలేదని తెలిపారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా సాయిని బైండోవర్‌ చేశామని, అతడిపై పలు కేసులున్నాయని చెప్పారు. ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలిస్తునట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు