ఆ పోస్టులను షేర్‌ చేసినా.. తిప్పలే!

20 Oct, 2019 02:17 IST|Sakshi

సామాజిక మాధ్యమాలపై పోలీసుల నిఘా

అభ్యంతరకర, విద్వేష,అసత్యపూరిత పోస్టులపై కన్ను

అటువంటి పోస్టులను షేర్‌ చేసినా.. తిప్పలే!

ప్రభుత్వం సెలవులను అక్టోబర్‌ 31 వరకు పెంచారు అన్న వార్తను ఓ ప్రముఖ టీవీ చానల్‌ ప్రసారం చేసినట్లుగా నకిలీ పోస్టు విపరీతంగా వైరలైంది. దీనిపై స్పందించిన ఆ చానల్‌ వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అది ఆ సంస్థ బహిష్కృత ఉద్యోగి పనిగా గుర్తించారు. 

ఇటీవల నగరానికి ఇద్దరు పోలీసు మహిళా ఉన్నతాధికారులపై ఓ యువకుడు అభ్యంతరకరంగా పోస్టులు పెట్టాడు. అంతే మరునాడు పోలీసులు అరెస్టు చేయడంతో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్రంలో ఓవైపు ఆర్టీసీ సమ్మె, విద్యుత్‌ ఆర్టిజన్ల ఆందోళనలు, జాతీయస్థాయిలో అయోధ్య వివాదంపైనా చర్చ నడుస్తోంది. ఇందుకు సోషల్‌ మీడియా వేదికవుతోంది. ఎవరికి తోచిన అభిప్రాయాలను వారు ఆన్‌లైన్‌లో వెల్లడిస్తున్నారు. ఇందులో కొన్ని అనుకూలంగా, మరికొన్ని వ్యతిరేకంగా ఉంటున్నాయి.ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ పోలీసులు సోషల్‌ మీడియాపై నిఘా పెట్టారు.

ముఖ్యంగా రెచ్చగొట్టే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు.ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా అన్నింటిపైనా సర్వైలెన్స్‌ నడుస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛ మేరకు ఎవరికి ఉన్న పరిధిలో ఎవరైనా తమ భావాలను వెల్లడించొచ్చు. కానీ, ఇతరులను రెచ్చగొట్టేలా, కొన్ని వర్గాలను కించపరిచేలా పోస్టులు పెడితే ఇబ్బందులు తప్పవని పోలీసులు చెబుతున్నారు.

ప్రతిదీ సోషల్‌ మీడియాలో.. 
టెలికం సంస్థల మధ్య పోటీ పుణ్యమా అని మొబైల్‌ డేటా విని యోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ప్రతి చిన్న విషయాన్నీ సోషల్‌మీడియాలో పెట్టేస్తున్నారు. ఆనందం, చిరాకు, పరాకులను కూడా పోస్టుల రూపంలో వెళ్లగక్కుతున్నారు. అలజడులు, అల్లర్లు సృష్టించేలా కొందరు ఆకతాయిలు పోస్టులు పెడుతుంటారు.

ఇలాంటి ప్రతీ పోస్టుపైనా సైబర్‌ పోలీసుల నిఘా ఉందన్న విషయం మరవద్దు. అభ్యంతరకర పోస్టులను చూస్తే వాటిపై కామెంట్, షేర్‌ అస్సలు చేయొద్దు. అలాంటి పోస్టులను లైక్‌ చేసినా, కామెంట్‌ చేసినా.. మీరూ చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంటెంట్‌ మరీ ఇబ్బందిరకంగా అనిపిస్తే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

చర్యలేంటి..? 
1.సోషల్‌ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తే ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 66(ఏ) ప్రకారం మీరు అరెస్టవుతారు.
2.పరువుకు భంగం వాటిల్లేలా పోస్టింగులు పెడితే సెక్షన్‌ 499 ప్రకారం.. మీరు శిక్షార్హులవుతారు.
3.ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని పరువుకు భంగం కలిగేలా పోస్టు లు పెడితే మీపై పరువునష్టం దావా కేసులు కూడా వేయొచ్చు.
4.అసభ్యకర పోస్టులు పెట్టి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే.. ఐపీసీ సెక్షన్లు 292, 292(ఏ), 293, 294 ప్రకారం అరెస్టవుతారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా