కరీంనగర్‌లో ఇం‍డోనేషియన్లకు ఏం పని..?

21 Mar, 2020 08:45 IST|Sakshi

‘‘కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకుల సహచరులు కరీంనగర్‌లో నాలుగు నెలలుగా పర్యటిస్తున్నారా..? గత నెల జగిత్యాలలో ఓ నిషేధిత సంస్థ నిర్వహించిన ఆవిర్భావ సభలో నాలుగు జంటల బృందం పాల్గొందా..? కరీంనగర్‌ రూరల్‌ ఏరియాలో పర్యటించిన బృందం ఇప్పుడెక్కడుంది..?  కరీంనగర్‌లో ఇండోనేషియా బృందాలకు ఏం పని ?’’ 

సాక్షి, కరీంనగర్‌: కరీంగనర్‌ ఉమ్మడి జిల్లా పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రామగుండం రైల్వేస్టేషన్‌కు వచ్చి.. అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్‌ వచ్చిన 10 మందితో కూడిన ఇండోనేషియా బృందం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఓ ప్రార్థనా మందిరంలో బస చేసింది. వీరిలో 10 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. వీరి గురించి ఆరా తీసినప్పుడు ఇండోనేషియా బృందాలు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించడం సర్వసాధారణమని తేలింది. మత ప్రచారం కోసం వచ్చినట్లు చెబుతుండగా... ప్రార్థనా మందిరాల్లో సమావేశాలు నిర్వహించి అదే మతానికి చెందిన వారికి ఏం బోధిస్తారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. (కరోనా బారిన పడింది వీరే..)

ప్రార్థనా మందిరాలలో, స్థానికులను విచారించినప్పుడు ‘ఇండోనేషియా నుంచి ఢిల్లీకి వచ్చి... అక్కడి మత పెద్దల సూచనల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి మత ప్రచారం సాగిస్తారని’ చెబుతున్నారు. కాగా గత నాలుగు నెలలుగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇండోనేషియా సభ్యులు బృందాలుగా విడిపోయి ఒక్కో ప్రార్థనా మందిరంలో రెండు మూడు రోజులు గడుపుతూ వస్తున్నట్లు తేలింది. రామగుండం నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందం ప్రార్థనా మందిరంలో బస చేసిన రోజులకు ఒకట్రెండు రోజుల ముందు మరో బృందం కరీంనగర్‌ రూరల్‌ ఏరియాలోని రేకుర్తి, సాలెహ్‌నగర్, గుంటూరుపల్లిలో తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వీరు ఎక్కడికెళ్లారనే విషయంలో స్పష్టత లేదు. 

నిషేధిత సంస్థ ఆవిర్భావదినోత్సవ సభకు హాజరు?
గత నెల 17న జగిత్యాలలో ఓ నిషేధిత సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసింది. ఈ కార్యక్రమానికి ఇండోనేషియాకే చెందిన బృందం హాజరైనట్లు సమాచారం. భార్యాభర్తలుగా దేశంలోకి వచ్చిన నాలుగు జంటలు ఫిబ్రవరి 8న ఢిల్లీ నుంచి రామగుండం చేరుకొని అక్కడి నుంచి జగిత్యాల ప్రాంతానికి చేరినట్లు సమాచారం. వీరు జగిత్యాలతోపాటు సిరిసిల్ల జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తోంది. కోరుట్ల, మెట్‌పల్లి, నిజామాబాద్‌లలోని ప్రార్థనా మందిరాల్లో తిరిగిన వీరు అదే నెల 17న జగిత్యాలలో ఓ నిషేధిత మత సంస్థ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. అక్కడి నుంచి రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలను కూడా సందర్శించి 18న తిరిగి ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు.

జగిత్యాలకు వచ్చిన నాలుగు జంటల్లో మహిళలు మత పెద్దల ఇళ్లల్లో ఉండగా, పురుషులే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. జగిత్యాల ఎస్‌పీ సింధూశర్మ దీనిపై ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా తాజాగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో నాలుగు జంటల బృందం పర్యటిస్తుండగా, స్థానికుల సమాచారంతో వారిని నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి క్వారంటైన్‌కు తీసుకెళ్లి పరీక్షలు జరిపారు. వీరు ఫిబ్రవరిలోనే కరీంనగర్‌ వచ్చినట్లు ఒప్పుకోవడం గమనార్హం. (ఇండోనేసియా బృందంలో అందరికీ పాజిటివ్‌)

ఈ నెలలో మళ్లీ కరీంనగర్‌ రూరల్‌ ఏరియాలో...
కరీంనగర్‌కు వచ్చి కరోనా బారిన పడ్డ ఇండోనేషియా బృందం కన్నా ముందు కరీంనగర్‌ రూరల్‌ ప్రాంతంలో మరో బృందం పర్యటించింది. 8 మందితో కూడిన ఈ బృందం ఈ నెల 10 తరువాత కరీంనగర్‌లో పర్యటించినట్లు ఆనవాళ్లు లభించాయి. రేకుర్తి, సాలేహ్‌ నగర్, బొమ్మకల్, గుంటూరుపల్లిలలో ఈ బృందం తిరిగినట్లు పోలీసులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఇదే బృందం రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లోని ఎంపిక చేసిన ప్రార్థనా మందిరాల్లో బస చేసినట్లు సమాచారం. ఈ లెక్కన రెండు నెలల వ్యవధిలో మూడు నుంచి నాలుగు బృందాలు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఓ పోలీస్‌ అధికారిని ప్రశ్నిస్తే... ‘ఇండోనేషియా నుంచి వచ్చే మత ప్రచారకులు ఢిల్లీ చేరుకొని అక్కడ మత పెద్దలను కలుస్తారు. వారు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళతారు. రైళ్లు, వ్యాన్‌లు, ఆటోల్లోనే దేశంలో పర్యటిస్తారు. కరీంనగర్‌కు రావడం సాధారణమే అయినా ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. (ఎమ్మెల్యే కోనప్పను క్వారంటైన్‌లో ఉంచండి) 

ఈ బృందాలకు.. మత సంస్థకు గల సంబంధాలపై ఆరా
నాలుగు నెలలుగా ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులు బృందాలుగా కరీంనగర్‌కు వస్తుండగా, అదే సమయంలో  అతివాద భావాలు గల ఓ మత సంస్థ తన కార్యకలాపాలను ఉధృతం చేసింది. జగిత్యాల, నిజామాబాద్‌లలో ఇప్పటికే ఒక వర్గంలో విద్యార్థులు, యువకులను భారీగా రిక్రూట్‌ చేసుకొని తన కార్యకలాపాలను విస్తృతం చేస్తున్న ఈ సంస్థ నాలుగు నెలలుగా కరీంనగర్‌పై దృష్టి పెట్టింది. అయితే కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ఈ సంస్థ కార్యకలాపాలు సాగకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడంలో సఫలీకృతులయ్యారు. తాజాగా ఈ నెల 17న కరోనాపై ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వందలాది మంది విద్యార్థులతో ఆ సంస్థ నాయకుడు సమావేశం ఏర్పాటు చేయగా, పోలీసులు భగ్నం చేశారు.

నాయకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్టుకు ఒకరోజు ముందు ఇండోనేషియా నుంచి కరోనా లక్షణాలతో వచ్చిన 10 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డితోపాటు జగిత్యాల ఎస్‌పీ సింధూశర్మ ఈ సంస్థ వ్యవహారాలపై విచారిస్తున్నారు. తాజాగా ఇండోనేషియా నుంచి వస్తున్న బృందాలకు ఈ సంస్థకు గల సంబంధాలపై కూడా విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు