ఫోన్‌లో ఏం మాట్లాడాడో.. అంతలోనే

6 Jun, 2017 10:27 IST|Sakshi
ఫోన్‌లో ఏం మాట్లాడాడో.. అంతలోనే
 
యాచారం : ప్రజల మానప్రాణాలు కాపాడాల్సిన ఆ పోలీసే.. ఓ యువతి పట్ల కాలయముడైనాడు.  ప్రేమించాలంటూ కానిస్టేబుల్ వేధింపులను తట్టుకోలేక ఆ యువతి వంటిపై కిరోసిన్‌ పోసుకోని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధర్మన్నగూడలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ చంద్రకుమార్‌, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్నన్నగూడకు చెందిన సోమా నర్సింహ నగరంలోని అంబర్‌పేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన మండల శ్యామల (23) అనే దళిత యువతిని ప్రేమించమంటూ నాలుగేళ్ల క్రితం వెంటపడ్డాడు. 
 
అతని వేధింపులు భరించలేక అప్పట్లోనే ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో సోమా నర్సింహను మందలించి, నచ్చజెప్పి వదలిపెట్టారు. బుద్ధిమారని ఆ కానిస్టేబుల్‌ తిరిగి ఫోన్‌లో శ్యామలను వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం యువతి తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లగానే గ్రామంలో ఉన్న అతడు సోమవారం శ్యామలకు ఫోన్‌ చేశాడు. ఫోన్‌లో అతను ఏదో మాట్లాడగానే శ్యామల వంటిపై కిరోసిన్‌ పోసుకోని నిప్పంటించుకుంది. తీవ్రంగా శరీరం కాలిపోవడంతో నగరంలోని గాంధీ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దళిత యువతి కావడంతో కానిస్టేబుల్‌ చులకనగా చూస్తూ వేధింపులకు గురిచేశాడని.. తన కూతురు శ్యామల ఆత్మహత్యకు సోమా నర్సింహనే కారకుడని మృతురాలి తండ్రి నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 
మరిన్ని వార్తలు