‘ఫంక్షన్‌’ టైమ్‌లో టెన్షన్స్‌ రానీయద్దు!

10 Aug, 2019 09:15 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులు

ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులకు స్పష్టం చేసిన పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధి నుంచి వెళ్ళే జాతీయ రహదారి నెం.44 అత్యంత కీలకమైంది. శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్ళే వాటితో పాటు బెంగళూరు మార్గంలో ప్రయాణించే వాహనాలకు ఇదే ఆధారం కావడంతో అనునిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో రోడ్డుకు రెండు వైపులా విస్తరించి ఉన్న ఫంక్షన్‌ హాళ్ళ కారణంగా వాహనచోదకులకు కొత్త టెన్షన్స్‌ వస్తున్నాయి. ఈ హాళ్లలో కీలక కార్యక్రమాలు, పెద్ద ఫంక్షన్లు జరిగినప్పుడు ఆహుతుల వాహనాలన్నీ రోడ్లపై ఉండిపోతున్నాయి. ఇది తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులకు కారణమై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళే వాళ్ళు హైరానా పడాల్సి వస్తోంది. ఈ విషయంపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు పదేపదే ఫిర్యాదులు అందుతున్నాయి.

దీంతో సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టిన ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ శుక్రవారం ఎన్‌హెచ్‌ నెం.44పై ఉన్న ఫంక్షన్‌ హాళ్ళ యజమానులతో సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలిలోని పోలీసు కమిషనరేట్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులతో పాటు 23 మంది ఫంక్షన్‌ హాళ్ళ యజమానులు హాజరయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న అనేక హాళ్లకు సరైన పార్కింగ్‌ వసతి లేదని గుర్తించామని, ఇతర  వసతులూ కరువయ్యాయని పోలీసులు స్పష్టం చేశారు. ఫంక్షన్‌ హాళ్లకు వచ్చే వారి వాహనాల కారణంగా జాతీయ రహదారిపై వెళ్ళే వారికి ఎలాంటి ఇబ్బందులకు లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్‌ బారికేడ్లు, కోన్లు, సైనేజ్‌లతో పాటు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టంలతో పాటు సీసీ కెమెరాలు  సైతం ప్రతి ఫంక్షన్‌ హాల్‌కు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో అప్రోచ్‌ రోడ్లు కచ్చితంగా ఉండాలని వారికి తెలిపారు.  ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, పికప్‌–డ్రాపింగ్‌ తదితరాల కోసం సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులతో ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. ఈ వసతులన్నింటినీ సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సైబరాబాద్‌ పోలీసులు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు