వివాదాల్లో చిక్కుకుంటున్న ఖాకీలు

13 Aug, 2019 08:16 IST|Sakshi

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పోలీసులు బరితెగిస్తున్నారు. తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు మహిళ అక్రమ రవాణా కేసులో నిందితుడైతే.. మరొకరు వివాహేతర సంబంధాలు.. వరకట్న వేధింపుల కేసును ఎదుర్కొంటున్నారు. ఇంకొకరు ప్రేమపేరుతో మహిళను గర్భవతి చేసి పరారీ కావడంతోపాటు ఆమె మృతికి కారణమయ్యాడు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో     కేవలం రెండురోజుల్లో జరిగిన ఈ మూడు ఘటనలు పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చిపెట్టాయి. 

సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ఏర్పడ్డాక అధికారం చేపట్టిన కేసీఆర్‌ ప్రభుత్వం శాంతిభద్రతలకు పెద్దపీట వేసింది. పోలీస్‌స్టేషన్‌ల ఆధునీకరణ, ఆధునాతన వాహనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని  అందుబాటులోకి తెచ్చింది. వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ పోలీసు వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేసింది. అవినీతి, ఒత్తిడిని నియంత్రించేందుకు జీతాలు పెంచడంతోపాటు, వారాంతపు సెలవులు కూడా అమలు చేస్తోంది.

ఓ వైపు ప్రభుత్వం పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తుంటే.. కొంతమంది పోలీసులు మాత్రం తమ పాత పద్ధతిని వీడడం లేదు. తమ ఖాకీ యూనిఫారాన్ని దౌర్జన్యాలకు, దందాలకు వినియోగిస్తూ.. వివాదాస్పదంగా మారుతున్నారు.  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు రోజుల్లో పోలీసులపై ఏకంగా మూడు కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను ప్రస్ఫుటిస్తోంది. అందునా మూడు కేసులూ మహిళలకు సంబంధించినవి కావడం వ్యవస్థను సిగ్గుపడేలా చేసింది. ప్రేమ పేరుతో మోసం, అక్రమ సంబంధం, వరకట్న వేధింపులు, మహిళల అక్రమరవాణ కేసులతో

పోలీసులు అప్రతిష్టను మూటగట్టుకున్నారు.
వివాదాలు, కేసుల్లో ఉన్న పోలీసులపై నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతుండడంతో మరింత బరితెగిస్తున్నారనే విమర్శలున్నాయి. మరికొంతమంది పోలీసులు సివిల్‌ తగాదాల్లో తలదూర్చుతున్నట్లు  ఫిర్యాదులున్నాయి. ముఖ్యంగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో తమ బినామీలతో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి పోలీసులపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టకుండా.. కఠిన చర్యలు తీసుకుంటేనే  వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.  

మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో జరిగిన సంఘటనల్లో కొన్ని...

  • రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా విక్రయంలో కోర్టు కానిస్టేబుల్‌ నిందితుడు కావడం కలకలం రేపుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలో గిరిజన మహిళను ఉద్యోగం పేరుతో మధ్యప్రదేశ్‌లో విక్రయించిన కేసులో కోర్టు కానిస్టేబుల్‌ కూడా నిందితుడు. కోర్టు కానిస్టేబుల్‌తో సహా ముగ్గురికి కోర్టు రిమాండ్‌ విధించింది. 
  • మంచిర్యాల జిల్లాలోని 17వ బెటాలియన్‌లో రిజర్వ్‌ సీఐగా పనిచేసిన శ్రీనివాస్‌పై లక్సెట్టిపేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీనివాస్‌పై ఆయన భార్యే ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతోపాటు, వరకట్నం కోసం వేధిస్తున్నారని రెండురోజుల క్రితం అతడి భార్య అవంతిక ఫిర్యాదు చేయడంతో లక్సెట్టిపేట పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. 
  • కొమురంభీం జిల్లాలో తాజాగా మరో పోలీసు నిర్వాకం దిగ్భాంతి కల్పించింది. సజన్‌లాల్‌ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగా ర్డుగా పనిచేస్తున్నాడు. ధాంపూర్‌ గ్రామానికి చెందిన గిరిజన మహిళను ప్రేమపేరుతో గర్భవతి చేశాడు. ప్రసవ వేదనపడుతున్న మహిళను రోడ్డుపై నిర్ధాక్షిణ్యంగా వదిలేయడంతో ఆమె మగబిడ్డను ప్రసవించి మృతి చెందింది. 
  • మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సై తైసినొద్దీన్, కానిస్టేబుల్‌ మాణిక్యరావు, మహిళా కానిస్టేబుల్‌ మల్లేశ్వరి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ పోలీస్‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు సస్పెండ్‌ అయ్యారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సంచలనం కలిగించింది.
  • రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొందరు కానిస్టేబుళ్లు అక్రమ దందాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మూడు నెలల క్రితం ఒకేసారి 9మంది కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. 
  • రామగుండం కమిషనరేట్‌ పరిధిలో టాస్క్‌ ఫోర్స్‌ బృందంలో ఉన్న ఇద్దరు సీఐలను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
  • కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మహా రాష్ట్రకు చెందిన ఎస్సై ఒకరు సంతలో రివా ల్వర్‌తో వీరంగం సృష్టించిన సంఘటన కూడా ఇటీవలే జరిగింది. స్థానికులు, స్థానిక పోలీసులు సదరు ఎస్సైని నిలువరించారు. 
  • తాజాగా కాళేశ్వరం సందర్శనకు వెళ్లి వస్తున్న కారు ఒకటి చెన్నూరు, సిరోంచ మధ్య బ్రిడ్జిపై డివైడర్‌ను ఢీకొట్టుకొని నిలిచిపోయింది. ఎవరికి ఎలాంటి ప్రమాదమూ వాటిల్లలేదు. కానీ మహారాష్ట్రకు చెందిన పోలీసు అధికారి ఒకరు వాహనదారులను బెదిరించి రూ.40 వేలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
మరిన్ని వార్తలు