నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

18 Jul, 2019 20:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3కి హోస్ట్‌గా వ్యవహరించనున్న సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 46లోని నాగార్జున ఇంటి వద్ద ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు బుధవారం సాయంత్రం నుంచే జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్‌ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు నాగార్జున ఇంటి ముందు కాపలాను పెంచారు. అటు వైపు వస్తున్న అనుమానితులను తనిఖీలు చేస్తున్నారు.

‘బిగ్‌బాస్‌’పై  హెచ్చార్సీలో ఓయూ జేఏసీ ఫిర్యాదు 
‘బిగ్‌బాస్‌’ షోను నిలిపివేయాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. జేఏసీ నాయకులు డాక్టర్‌ కందుల మధు, వేల్పులకొండ వెంకట్‌ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ కోసం నటీనటుల ఎంపికకు స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారని, ఆ టెస్టులకు మహిళలను ఆహ్వానించి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. వేధింపులపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. సభ్యులను మూడు నెలలు నిర్బంధంలో ఉంచి రహస్యంగా దృశ్యాలు చిత్రీకరించడం, వారితో ముందుగానే బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్‌ రాసుకోవడం, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని ఆడవాళ్లను లైంగికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ షోను నిలిపివేసేలా కమిషన్‌ ఆదేశాలు ఇవ్వాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు