ఏటీఎం మిషన్లే వీరి టార్గెట్‌

4 Jul, 2020 12:05 IST|Sakshi

సాక్షి, గజ్వేల్‌ :  జల్సాలకు అలవాటు పడిన నలుగురు యువకులు సులువుగా డబ్బు సంపాదించాలని చోరీ బాట పట్టారు. పథకం ప్రకారం రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. మూడోసారి ఎలాగైనా డబ్బు దొంగిలించాలని పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఓ ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు. గజ్వేల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డారు. గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధి ప్రజ్ఞాపూర్‌ చౌరస్తా జగదేవ్‌పూర్‌ రోడ్డులో ఉన్న ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలుసుకున్నట్లు గజ్వేల్‌ ఏసీపీ నారాయణ వెల్లడించారు. ప్రజ్ఞాపూర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చోరీ వివరాలు తెలిపారు. 

గజ్వేల్‌ పట్టణంలోని పిడిచెడ్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారు జామున ఐడీబీఐ ఏటీఎం వద్ద ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్న క్రైమ్‌ పార్టీ పోలీస్‌ కానిస్టేబుళ్లకు కనిపించారు. వారిని తనిఖీ చేయడంతో ఆటోలో గడ్డపార, సుత్తి, రాడ్, కటింగ్‌ ప్లయర్‌ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. ములుగు మండలం తున్కిబొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నివాసముంటున్న బైలంపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు బొమ్మ స్వామి, బొమ్మ ఐలేని అలియాస్‌ ఐలేష్‌ అన్నదమ్ములు. బొమ్మ స్వామి ఆటో(టీఎస్‌ 26టీ 2021)ను తన గ్రామం నుంచి గజ్వేల్‌కు నడుపుతుంటారు. వీరికి గజ్వేల్‌ పట్టణంలోని ఢిల్లీవాల హోటల్‌ సమీపంలో నివాసముండే పెయింటర్‌ రాయపోల్‌ మండలం మంతూర్‌ గ్రామానికి చెందిన తంగలపల్లి నవీన్‌ అలియాస్‌ నవీన్‌కుమార్, వడ్డేపల్లికి చెందిన అయ్యగల్ల నవీన్‌తో పరిచయం ఏర్పడింది. ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే పథకం పన్నారు.

ఏటీఎంల్లో డబ్బులు ఉండి సెక్యూరిటీ ఉండని వాటిని చోరీ చేసేందుకు ప్లాన్‌ వేసుకున్నారు. ఈ క్రమంలో జూన్‌ 11న తుర్కపల్లి దగ్గరలోని మురహరిపల్లి ఏటీఎం వద్దకు స్వామి ఆటోలో ఐలేష్, తంగలపల్లి నవీన్, అయయగల్ల నవీన్, గంగొల్ల ప్రశాంత్‌ వెళ్లి సీసీ కెమెరాల వైర్లను తొలగించారు. ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మళ్లీ రెండోసారి జూన్‌ 22న రాత్రి సమయంలో గౌరారం బస్టాప్‌ సమీపంలో ఉన్న ఏటీఎం సీసీ కెమరాల వైర్లను తొలగించారు. మిషన్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించి మరోసారి విఫలయ్యారు. రెండు సార్లు ప్రయత్నించి విఫలం కావడంతో జూన్‌ 26వ తేదీన స్వామి, ఐలేష్, తంగలపల్లి నవీన్, అయ్యగల్ల నవీన్‌ సమావేశమయ్యారు. మూడోసారి ఎలాగైనా చోరీ చేయాలని పక్కా ప్లాన్‌ వేసుకున్నారు.

ఈ క్రమంలో ముందుగా ప్రజ్ఞాపూర్‌కు వచ్చి జగదేవ్‌పూర్‌ రోడ్డులో బెంగుళూరు కేంద్రంగా నడిచే ఇండియా వన్‌ ఏటీఎం సెంటర్‌ వద్ద రెక్కి నిర్వహించారు. అదే రోజు రాత్రి సీసీ కెమెరాలను తొలగించి వెళ్లారు. 27న ఆటోలో ఏటీఎం సెంటర్‌కు వచ్చి ఏటీఎం మిషన్‌ను రాడ్లతో పెకిలించారు. మిషన్‌ను ఆటోలో వేసుకొని రింగురోడ్డు మీదుగా గౌరారం మార్స్‌ కంపెనీ పక్కన ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ. 4,98,800 నగదును పంచుకున్నారు. అయితే బొమ్మ స్వామి 2015లో గజ్వేల్‌లో దొంగతనం చేసిన కేసులో, అతడి తమ్ముడు ఐలేష్‌ ములుగు అత్యాచారం కేసులో అరెస్టయి జైలుకు వెళ్లారు. ఇక దొంగిలించిన డబ్బు పంచుకోగా అందులో రూ. 28 వేలు ఖర్చుచేశారు.

వీరి నుంచి రూ.470 లక్షల నగదు, ఆటో, దొంగతనానికి ఉపయోగించిన గడ్డపార, సుత్తి, రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసున్నారు. ఏటీఎం మిషన్‌ చోరీకి గురైనట్లు జూన్‌ 29న దుద్దెడకు చెందిన గున్నాల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు చేధించి దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన గజ్వేల్‌ సీఐ ఆంజనేయులు, అదనపు సీఐ మధుసూదన్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ నర్సింహారావు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ ప్రసాద్, సీసీ కెమెరా టీం సభ్యులు పరంధాములు, ఏఎస్‌ఐ సంధాని, క్రైంపార్టీ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటయ్య, పోలీస్‌ కానిస్టేబుళ్లు యాదగిరి, సుభాష్‌ను రివార్డుతో అభినందించినట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు