పోలీసుల ఓవర్‌ యాక్షన్‌.. తిరగబడ్డ ఆటో డ్రైవర్‌

19 May, 2019 12:08 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్‌నగర్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల ఓవర్‌ యాక్షన్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. వారికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో పరిస్థితి అదుపు తప్పింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఘన్‌శ్యామ్‌ 2018 జూలై 23న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆటోపార్కింగ్‌ విషయంలో పోలీసులతో జరిగిన గొడవలో రాస్తారోకో చేయగా..అప్పుడు అతనితోపాటు పలువురిపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా శనివారం ఎస్సై గంగారం సిబ్బందితో కలిసి ఘన్‌శ్యామ్‌ ఇంటికి వచ్చారు. 

తొలుత పోలీసులు గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై చెయ్యి చేసుకోవడంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య గొడవ మొదలైంది. తర్వాత ఘన్‌శ్యామ్‌ను రిమాండ్‌కు తరలించేందుకు జీప్‌లో ఎక్కించడతో ఈ గొడవ మరింత ముదిరింది. అతన్ని ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలంటూ గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించారు. కాగా ఎస్సై తమ ఇంటికొచ్చి ఘన్‌శ్యాంను కొట్టడంతోపాటు మహిళలపై కూడా చేయి చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్పీ వచ్చే వరకు పోలీస్‌ వాహానాన్ని పోనివ్వమని అడ్డుకున్నారు. పోలీసు వాహనం అక్కడి నుంచి కదలకుండా ఘన్‌శ్యామ్‌ దంపతులు దానికి అడ్డుగా పడుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఉట్నూర్‌ సీఐ వినోద్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చూశారు. డీఎస్పీ డెవిడ్‌ కూడా ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి సీఐ, ఎస్సైతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

మరిన్ని వార్తలు