పోలీస్‌ పహారాలో ‘శివన్నగూడ’

5 Dec, 2017 10:26 IST|Sakshi

మర్రిగూడ (మునుగోడు) : డిండి ప్రాజెక్టు పరిధిలోని శివన్నగూడ రిజర్వాయర్‌ నిర్మాణ ప్రదేశం సోమవారం పోలీస్‌ పహారాతో నిండిపోయింది. ముంపుబాధితులు, పోలీసులకు జరిగిన ఘర్షణే ఇందుకు కారణం. రిజర్వాయర్‌ ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో  పరిహారం చెల్లించకుండా పనులు చేస్తుండడంతో తరచూ అడ్డుకుంటున్నారు. అదేవిధంగా కొద్దిరోజులుగా ధర్నాలు చేస్తున్నారు. శివన్నగూడ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న శశిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు ఆదివారం పనులను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న కాంట్రాక్టర్‌ సిబ్బంది..వారిద్దరిపై దాడి చేశారు. ఈ విషయం శివన్నగూడ, నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులకు తెలిసింది. ‘‘మాకు పరిహారం ఇవ్వరు. పనులు ఎలా చేస్తారంటూ రెండు గ్రామాల ప్రజలు సోమవారం  పనుల అడ్డగింతకు బయలుదేరారు. వందమందికిపైగా కలిసి ఉదయం 10.30 గంటలకు రిజర్వాయర్‌ పనుల వద్దకు వెళ్లారు.

 అప్పటికే బందోబస్తు నిమిత్తం చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరిగాయి. పోలీసులు..రిజర్వాయర్‌ కాంట్రాక్ట్‌కు వత్తాసు పలుకుతూ పనులు చేయిస్తున్నారని ఆగ్రహించిన ముంపుబాధితులు అక్కడి క్యాంప్‌ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో వారిపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్‌ చేశారు. సంఘటనలో కొంతమంది మహిళలకు, రైతులకు దెబ్బలు తగిలాయి.  సీఐ బాలగంగిరెడ్డి తమను అసభ్యపదజాలంతో దూషిస్తూ లాఠీలతో చితకబాదాడని పలువురు మహిళలు ఆరోపించారు. ముంపుబాధితులు ఎదురుదిరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గలాటాలో సీఐ బాలగంగిరెడ్డి తలకు స్వల్పగాయమైంది. ఆయనకు వెంటనే చికిత్స అందించారు. 

40శాతం దాటని పరిహారం 
దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో బీడు భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డిండి ప్రాజెక్టును చేపట్టింది. ఇందులోభాగంగా ఐదు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. వీటిలో  10 టీఎం సీల నీటి సామర్థ్యంతో  శివన్నగూడ రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది. ఈ రిజర్వాయర్‌ కోసం 4,100 ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నట్లు గుర్తించారు. వీటిలో 470 ఎకరాల ప్రభుత్వ భూమి పోను 3,630 ఎకరాలపైగా రైతులనుంచి సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్‌ నిర్మాణ ద్వారా చెర్లగూడెం, వెంకపల్లి, వెంకపల్లితండా, నర్సిరెడ్డిగూడెం గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఇప్పటివరకు ప్రభుత్వం 1170 ఎకరాలకు 123 జీఓ ప్రకారం ఎకరాకు రూ.4,15,000 చొప్పున పరిహారం అందించింది. అదే విధంగా తాజాగా పెంచిన పరిహారంతో ఎకరాకు రూ.5,15,000 చొప్పున 450 ఎకరాలకు పరిహారం ఇచ్చారు. ఇచ్చే పరిహారం 40శాతం కూడ దాటలేదు. ఈ ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015, జూన్‌12న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి దాదాపుగా రెండేళ్లవుతున్నా పరిహారం మాత్రం రైతులకు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఇంకా 2,500 ఎకరాల పైగా పరిహారం ఇవ్వాల్సి ఉంది.

100 రోజుల దాటిన పోరాటం
శివన్నగూడ రిజర్వాయర్‌ ముంపు భూములకు ప్రతి ఎకరాకు రూ.15లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌ 21నుంచి బాధితులు 
నిరవధిక ధర్నా చేస్తున్నారు. వివిధ రూపాల్లో చేస్తున్న వారి నిరసన కార్యక్రమాలు వంద రోజులకుపైగా దాటాయి. 

మరిన్ని వార్తలు