సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా

12 Nov, 2018 17:24 IST|Sakshi
పెంచికల్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతున్న ఎస్పీ మల్లారెడ్డి 

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ను ఆనుకుని ఉన్నందున అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు. ప్రాణహిత పరీవాహక ప్రాంతం వెంట కూంబింగ్‌ ముమ్మరం చేశామని, సంఘ వ్యతిరేక శక్తులు జిల్లాలో ప్రవేశించకుండా కట్టుది ట్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రణాళికలు రూపొం దించామన్నారు. జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు.

ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో నాటుసార కేంద్రాలు, బెల్టు దుకాణాలను అరికట్టడంతోపాటు విక్రయాలు జరిపే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఇతరులను కించపరిచేలా మాట్లాడటం, సోషల్‌ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట కాగజ్‌నగర్‌ డీఎస్పీ సాంబయ్య, పెంచికల్‌పేట్‌ ఎస్సై రమేశ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు