వీరు అడగరు.. వాళ్లు ఇవ్వరు..

27 Aug, 2019 11:29 IST|Sakshi

ఎవరికీ పట్టని ప్రోత్సాహకాలు?

ఏటా రూ.కోట్లు పొందేందుకు ఆస్కారం

పట్టించుకోని పోలీసు విభాగం

గాంబ్లింగ్‌ నుంచి ఐటీ కేసుల వరకు ‘చాన్స్‌’

ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఉత్తమం

సాక్షి, సిటీబ్యూరో: మాదకద్రవ్యాలు, పేకాట శిబిరాలు, హవాలా గ్యాంగ్స్‌... ఇలాంటి వాటిపై నిత్యం కన్నేసి ఉంచుతున్న నగర పోలీసులు ఎప్పటికప్పుడు చెక్‌ చెప్తున్నారు. ఈ కేసులను అధికారికంగా ‘క్యాష్‌’ చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏటా ప్రోత్సాహకాల రూపంలో రావాల్సిన రూ.కోట్లు నగర పోలీసు విభాగం నష్టపోతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆయా కేసుల్లో ప్రోత్సాహకాలు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.

హుండీ ముఠాలకు కేరాఫ్‌...
ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతూ రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా గాను, దేశంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగే మార్పిడిన హుండీ వ్యాపారంగా పేర్కొంటారు. నగరంలో హుండీ వ్యాపారం జోరుగా సాగుతుంటోంది. పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ మార్గంలో లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి ‘పన్ను పోటుతో’ పాటు అసాంఘికశక్తులు, మాఫియా, ఉగ్రవాదులకు అనువుగా ఉందని భావించిన నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తుంటారు. శాంతిభద్రతల విభాగం అధికారులు అప్పుడప్పుడు ఈ గ్యాం గ్స్‌ను పట్టుకుంటూ ఉంటారు. ఏటా రూ.5 కోట్లకు పైగానే హుండీ/హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. గత ఏడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ మొత్తం రూ.13 కోట్లకు చేరింది.

పది శాతానికి అవకాశం ఉన్నా...
ఆదాయపుపన్ను శాఖ నిబంధనల ప్రకారం ఆదాయానికి మించిన/అక్రమ ఆస్తులు, హవాలా, హుండీ తదితర వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఇచ్చి, వాటి గుట్టును బయటపెడితే సదరు ఇన్‌ఫార్మర్‌కు పది శాతం కమీషన్‌గా ఇస్తారు. ఈ అవకాశం చట్టమే వారికి కల్పించింది. ఏటా నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులే హుండీ/హవాలాలకు సంబంధించిన అనేక ముఠాల గుట్టును రట్టు చేస్తున్నారు. వీరి నుంచి రూ.కోట్లల్లో నగదు స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగిస్తున్నారు. గత ఏడాది పట్టించిన రూ.13 కోట్లల్లోనూ నగర పోలీసులకు కనీసం రూ.1.3 కోట్లు రావాల్సి ఉంది. ఏటా ఈ స్థాయిలో రాకపోయినా కనీసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వచ్చే ఆస్కారం ఉంటోంది. 

ఆ రెండు కేటగిరీల్లోనూ ఆస్కారం...
హవాలా/హుండీ ముఠాలే గాక, పేకాట శిబిరంపై దాడి చేసినా, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నా నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు పొందే ఆస్కారం ఉంది. మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న అనేక ముఠాలు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, శాంతిభద్రతల విభాగం అధికారులకు చిక్కుతూ ఉంటాయి. వీరి నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుంటుంటారు. వీరితో పాటు గంజాయి ముఠాలు, పేకాట శిబిరాలపై దాడులు చేసి నిందితులకు చెక్‌ చెబుతూ ఉంటారు. ఈ కేసుల్లోనూ ఆయా విభాగాల నుంచి ప్రోత్సాహకం పొందే ఆస్కారం ఉంది. డ్రగ్స్‌ కేసుల్లో పట్టుకున్న మాదకద్రవ్యం విలువలో 15 శాతం, పేకాట (గాంబ్లింగ్‌) కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తంలో 10 శాతం ప్రోత్సాహకంగా అందించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.  

పట్టుకున్నంత అప్పగించడమే...
ఈ హుండీ ముఠాలు ఉత్తరాది కేంద్రంగానే పని చేస్తున్నాయి. ప్రధాన సూత్రధారులు అక్కడే ఉంటున్నా నగరంలోని ఏజెంట్ల ద్వారా ఫోన్‌ కాల్స్‌తో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లపై తమ వేగుల ద్వారా సమాచారం అందుకుంటున్నటాస్క్‌ఫోర్స్, ఇతర విభాగాల అధికారులు వారిని పట్టుకుని, భారీగా నగదుస్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల లింకు ఉన్నట్లు ఆధారాలు లభిస్తే తప్ప మిగిలిన కేసుల్ని ఆపై దర్యాప్తు, విచారణ చేసే అధికారం మాత్రం పోలీసులకు లేదు. ఈ నేపథ్యంలోనే పట్టుకున్న ప్రతి ముఠాను స్వాధీనం చేసుకున్న నగదుతో సహా తక్షణం ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించాల్సిందే. ఆ తరవాత వ్యవహారమంతా వారే చూసుకుంటారు. తదుపరి పురోగలి ఏమిటనేది కూడా వారు పోలీసులకు వెల్లడించరు.  

ఆసక్తి చూపని అధికారులు
ఈ కేసుల్లో అత్యధికం టాస్క్‌ఫోర్స్‌ అధికారులే పట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాలు ఇన్‌ఫార్మర్లుగా పిలిచే వేగుల్ని ‘నిర్వహించడానికి’ అవసరమైన ఖర్చుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో ఉన్న ప్రోత్సాహకాల అవకాశాన్ని వినియోగించుకుని, తమకు రావాల్సిన మొత్తాన్ని ఆదాయపుపన్ను శాఖతో పాటు ఇతర విభాగాలను అడగడానికి మాత్రం ఆయా వింగ్స్, ఉన్నతాధికారులు ఆసక్తి చూపడం లేదు. ఐటీ అధికారులైనా నగర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమని, వారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఇచ్చినట్లే అనే కోణంలో ఆలోచించట్లేదు. ఫలితంగా అందాల్సిన ప్రోత్సాహకాలు అందట్లేదు. ఇకనైనా అధికారులు స్పందించి నిబంధనల ప్రకారం రావాల్సిన, వచ్చే అవకాశం ఉన్న ప్రోత్సాహకాల్ని నగర పోలీసు, టాస్క్‌ఫోర్స్‌ విభాగాలకు లేదా పోలీసు సంక్షేమ నిధికి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందని సిబ్బంది పేర్కొంటున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా