అశ్వారావుపేట:‘తమ్ముళ్ల’ తంటాలు !

3 Dec, 2018 15:03 IST|Sakshi
అశ్వారావుపేట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

 ‘పేట’లో పర్యటిస్తున్న ఏపీ టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 

 మెచ్చాను గెలిపించాలని ఆ రాష్ట్ర  నేతలకు బాబు ఆదేశం  

 ఆగని డబ్బు అక్రమ రవాణా.. అదే బాటలో మద్యం కూడా ?  

సాక్షి, అశ్వారావుపేట:  అశ్వారావుపేటలో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపును  ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  బాబు ఆదేశాలతో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ఇక్కడే తిష్ట వేస్తున్నారు. ఎలాగైనా గెలిపించాలని ఏపీ తెలుగు తమ్ముళ్లు సర్వశక్తులొడ్డుతున్నారు. అక్కడి నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శనివారం సాయంత్రం ఏలూరు జెడ్పీ చైర్మన్‌ నగదుతో అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద దొరికిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపగా.. వెంటనే ఏపీ పోలీసులను చెక్‌పోస్టు వద్దకు పిలిపించుకుని తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చెక్‌పోస్టు వద్దకు పొరుగు రాష్ట్రం పోలీసులు అనాలోచితంగా రావడం, కనీసం ఉద్యోగ భద్రత గురించి కూడా ఆలోచించకుండా రావడం ఏంటనే చర్చ జరుగుతోంది.

అయితే జెడ్పీ చైర్మన్‌ ఎంట్రీ ట్రయల్‌ మాత్రమేనని, ఆయన ప్రయత్నం ఫలిస్తే నేరుగా హైవే మీదుగానే డబ్బు రవాణా చేయొచ్చని భావించినట్లు సమాచారం. ‘తెలుగుదేశం పార్టీ మీకు ఈ స్థానాన్నిచ్చింది.. అశ్వారావుపేట స్థానాన్ని గెలిపించి మీ విశ్వాసాన్ని చూపించండి..’ అని బాస్‌ ఆదేశించడంతో ఇసుక ర్యాంపులు, బాక్సైట్‌ గనులు, చేపల చెరువులు, కొల్లేరు ఆక్రమణలు.. ఇలా ప్రభుత్వ అండతో కోట్లకు పడగలెత్తిన ప్రబుద్ధులు అవసరమైన ఇం‘ధనాన్ని’ సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది.  
రవాణాకు ఎన్ని మార్గాలో..  
నియోజకవర్గంలో అశ్వారావుపేట, దమ్మపేట మండలం మందలపల్లి వద్ద మాత్రమే చెక్‌పోస్టులున్నాయి. అయితే అశ్వారావుపేట నుంచి ఏపీకి బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి సులభంగా డబ్బు సంచులు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మండలాలను చేరుకోవాలంటే ఉన్న పలు మార్గాలను చెక్‌పోస్టులతో నియంత్రించాలంటే ప్రస్తుతం ఉన్న పోలీసు బలగాలు సరిపోవు. ఇదే అదనుగా ఇప్పటికే సంచులు సరిహద్దు దాటించారనే  ప్రచారం జరుగుతోంది.  
అదేబాటలో మద్యం .. 
నగదు తరలించినట్లుగానే మద్యం బాటిళ్లను కూడా తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులకు ప్రభుత్వ మద్యం రవాణా కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో మద్యం డిపో నుంచి అశ్వారావుపేట మీదుగా మాత్రమే వెళ్లాలి. అలాగే ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా దమ్మపేట, అంకంపాలెం, తిరుమలకుంట, వినాయకపురం వచ్చి.. అక్కడ నుంచి ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వెళ్లొచ్చు. ఈ రెండు మార్గాల్లో ఎన్నికల సంఘం, పోలీసులు, ఎక్సైజ్‌ ఏ ఇతర శాఖాధికారులు తనిఖీ చేసినా.. ప్రభుత్వ బిల్లుతో ఆ రాష్ట్రానికి తెలంగాణ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇదంతా అక్కడికి వెళ్లకుండా అవసరమైన మేరకు తెలంగాణలోనే ఆగుతోందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏపీకి సరిహద్దులో ఉండడం.. అశ్వారావుపేట మండలానికి మూడు వైపులా ఏపీ ఉండడం ఈసారి బాగా కలిసొచ్చినట్లు చెప్పుకుంటున్నారు.  
తనిఖీలు చేస్తూనే ఉన్నాం.. 
రవాణా మార్గాలు అధికంగా ఉన్న అశ్వారావుపేటకు ఒక చెక్‌పోస్టు నిర్వహిస్తున్నాం. బీటీ రహదారులు రద్దీగా ఉండే చోట చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. సిబ్బంది, అనుమతి రావాల్సి ఉంది. ప్రత్యేక భద్రతా దళాలను విడివిడిగా వాడలేం. కేంద్ర ప్రభుత్వ దళాలు కావడంతో పూర్తిగా మన ఆధీనంలోకి తీసుకోలేం. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పోలీసు బలగాలు రానున్నాయి. తనిఖీలు ముమ్మరం చేస్తాం. ఇప్పటికే మొబైల్‌ టీంల ద్వారా నిఘా ఏర్పాటుచేశాం.–ఎం.అబ్బయ్య, సీఐ, అశ్వారావుపేట  

మరిన్ని వార్తలు