9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?

3 Jun, 2020 10:35 IST|Sakshi
సంజయ్‌ను మీడియా ముందుకు తీసుకొస్తున్న పోలీసులు (ఫైల్‌)

విచారణలో బయటపడలేదా.. అయినా చెప్పడం లేదా?

షాపు పేరు వెల్లడిలో అధికారుల మీనమేషాలు

‘గొర్రెకుంట’ కేసులో రహస్యంగా ఉంచడంపై అనుమానాలు

కొనసాగుతున్న సంజయ్‌కుమార్‌ విచారణ

అద్దె ఇంటి వద్ద సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ 

4వ తేదీతో ముగియనున్న పోలీస్‌ కస్టడీ 

సాక్షి, వరంగల్‌ రూరల్‌: గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భా గంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేశాడని పోలీసులు వెల్లడించా రు. ఇంత వరకు బాగానే ఉన్నా పెద్దమొత్తంలో నిద్ర మాత్రలు ఏ షాపులో కొనుగోలు చేశాడనే వివరాలు చెప్పకపోవడం గమనార్హం. విచారణలో భాగంగా నిందితుడు వరంగల్‌ చౌరస్తాలోని ఓ షాపులో మాత్రలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెబుతున్నా ఆ షాపు పేరు బహిర్గతం చేయడం లేదు. దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

మూడు రోజుల్లో చిక్కిన నిందితుడు
తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మరో తొమ్మిది మందిని హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన జరిగాక పోలీసులు పడక్బందీ వ్యూహంతో ఏడు బృందాలు విడిపోయి మూడు రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తొమ్మిది మందిని ఒక్కడే హతమార్చాడని వెల్లడిందని చెప్పిన పోలీసులు.. ఇంత మందిని హతమార్చేందుకు గాను బాధితులకు మత్తు కోసం 60 వరకు నిద్రమాత్రలను ఉపయోగించాడని ప్రకటించారు.

కానీ నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్‌ షాపు పేరు కనుక్కోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పోలీసులకు షాపు పేరు తెలిసినా వెల్లడించడం లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి హంతుకుడిగా కఠిన శిక్షపడేలా చేస్తామని చెబుతున్న పోలీసులు.. మందుల షాపు విషయంలో మాత్రం తాత్సారం ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు


ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే 60 మాత్రలా?
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రిస్క్రిప్షన్‌ లేకుండా దగ్గు, జలుబు మాత్రలు కూడా విక్రయించకూడదని మెడికల్‌ షాపుల నిర్వాహకులను రాష్ట్ర, జిల్లా అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ ఔషధ దుకాణాల నిర్వాహకులు తమ తీరును మార్చుకోవడం లేదని ఈ ఘటనలో వెల్లడైంది. గొర్రెకుంట ఘటనలో నిందితుడు ఉపయోగించిన 60 నిద్రమాత్రలు ఒక్క దుకాణంలోనే కొనుగోలు చేశాడా.. లేదంటే పలు షాపుల్లో తీసుకున్నాడా అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ విషయంపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల వివరణ కోరగా హంతకుడు ఉపయోగించిన నిద్రమాత్రల బ్యాచ్‌ నెంబర్‌ను తమకు తెలియజేస్తే ఏ షాపులో ఔషధాలు కొనుగోలు చేశాడనేది తేలేతుతుందని చెబుతున్నారు. బ్యాచ్‌ నంబర్‌ వివరాలు తెలపాలని పోలీసులను సైతం కోరామని స్పష్టం చేస్తున్నారు.

విచారణలో చెప్పలేదా..
పోలీసుల విచారణలో హంతకుడు నిద్రమాత్రలు కొనుగోలు చేసిన ఔషధ దుకాణం పేరు వెల్లడించలేదా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. హత్య జరిగిన తీరును పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో వెల్లడించినా ఔషధ దుకాణాల పేర్లు మాత్రం బహిర్గతం చేయలేదు. దీంతో అసలు మతలబు ఏమిటనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారులు ఈ అంశంపై పెదవి విప్పకపోగా.. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాత్రం మాత్రల బ్యాచ్‌ నంబర్‌ కోసం పోలీసులను అడిగామని చెప్పడం గమనార్హం. చదవండి:  9 హత్యల కేసు: ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు శాంపిళ్లు

డేగకళ్లతో నిఘా
గీసుకొండ: గొర్రెకుంట శివారులోని బావిలో తొమ్మిది మందిని, అంతకు ముందు ఓ మహిళను హత్య చేసిన నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ పోలీసు కస్టడీ కొనసాగుతోంది. కేసు విషయంలో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆయనను పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆరు రోజుల కస్టడీ ఈనెల 4వ తేదీతో ముగియనుండగా అదేరోజు కోర్టులో హాజరు పర్చాల్సి ఉంది. ఈమేరకు ఘటనా స్థలమైన బావి, బార్‌దాన్‌ గోదాంతో పాటు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ తిరిగిన వరంగల్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయనను తీసుకెళ్లి పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈక్రమంలో ఆయనను అనునిత్యం గమనిస్తూ ఆరుగురు పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఉదయం పూట విచారణకు తీసుకెళ్తే పారిపోయే అవకాశముందని భావిస్తూ కేవలం రాత్రివేళ బందోబస్తు నడుమ విచారణ సాగిస్తున్నట్లు సమాచారం.

వారితో ఎలా ఉండేవాడు?
హత్యకు గురైన మహ్మద్‌ మక్సూద్‌ ఆలం కూతురు బుష్రా ఖాతూన్‌ మూడేళ్ల కుమారుడు బబ్లూ ఏడుస్తుండగా గొంతు నులిమి హత్య చేసి బావిలో వేసినట్లు తేలిన విషయం విదితమే. ఇదేక్రమంలో గ్రేటర్‌ పరిధి 4వ డివిజన్‌ స్తంభంపెల్లి పరిధిలోని ఆదర్శ నగర్‌లో సంజయ్‌కుమార్‌ యాదవ్‌ అద్దెకు ఉన్న ఇంటి వద్ద పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ తరహాలో మంగళవారం విచారణ జరిపినట్లు సమాచారం. మక్సూద్‌ ఆలం భార్య నిషా అక్క కూతురు రఫీకాతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తె, ఇద్దరు కుమారులతో అద్దె ఇంటిలో నివాసమున్నట్లు గతంలోనే పోలీసులు గుర్తించారు. అయితే, పిల్లలతో ఎలా ఉండేవాడు, రఫీకాను ఎలా తీసుకెళ్లి నిడదవోలు వద్ద రైలు నుంచి కిందికి తోసి హత్య చేశాడనే విషయాలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. విచారణ తర్వాత మంగళవారం రాత్రి సంజయ్‌ను గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచినట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా