అంతర్జాతీయ స్మగ్లర్లపై పోలీసుల ఫోకస్

5 Sep, 2015 03:59 IST|Sakshi
అంతర్జాతీయ స్మగ్లర్లపై పోలీసుల ఫోకస్

 విదేశాల నుంచి వచ్చే బంగారం, మత్తు పదార్థాలపై దృష్టి
     ప్రత్యేక బృందం ఏర్పాటు
     విమానాశ్రయంలో పట్టుబడుతున్న వారిపై లోతుగా ఆరా
     సూత్రధారులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నం
 సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ స్మగ్లర్లపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా బంగారం, మత్తు పదార్థాలు తరలిస్తూ పట్టుబడుతుండటంతో ఈ అంశంపై లోతుగా విచారణ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోట్ల రూపాయల విలువ చేసే కేజీల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. అయితే వీటికి చాలా వరకు జరిమానా వేసి కస్టమ్స్ అధికారులు వదిలేస్తున్నారు. వీటిలో చాలా వరకు పాత్రధారులు మాత్రమే పట్టుబడుతున్నారు.

ఈ నేపథ్యంలో దీని వెనకున్న అసలు సూత్ర ధారులెవరనే విషయాన్ని కస్టమ్స్ అధికారులు తమ పరిధిలోకి రాదని పట్టించుకోవడం లేదు. ఇన్నాళ్లు వీటిపై పోలీసులు కూడా దృష్టి కేంద్రీకరించలేదు. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మూసియా మూసా (32) రూ.50 లక్షలకు పైగా విలువ చేసే డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకొస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు సూత్రధారులను నిగ్గుతేల్చితే బంగారం, డ్రగ్స్ సరఫరాను అరికట్టవచ్చని పోలీసులు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి బంగారం, ఇతర మత్తు పదార్థాలు తీసుకొచ్చిన వెంటనే ఆ కేసు పూర్వాపరాలన్నీ కూడా కస్టమ్స్ అధికారుల నుంచి తీసుకొని పట్టుబడిన వ్యక్తులను కూడా తమ అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. వారి ద్వారా సూత్రధారులను పట్టుకోవాలని నిర్ణయించారు.
 కిలోల కొద్దీ బంగారం పట్టివేత..
 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ రోజూ 20కి పైగా విదేశాల నుంచి విమాన సర్వీసులు నడస్తున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, సింగపూర్‌ల నుంచి వచ్చే వారు అత్యధికంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడుతున్నారు. 2014 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చి 31 వరకు శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాకు సంబంధించి 125 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి 127.67 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.31 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో చాలా వరకు జరిమానాలు విధించి వదిలేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 30 కేసులకు పైగా నమోదయ్యాయి.
నిబంధనలతో కొంత తీసుకురావొచ్చు..
 విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం తీసుకరావాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. భారతీయులు ఏడాదిపాటు విదేశాల్లో ఉండి వచ్చేటప్పుడు పురుషులు అయితే రూ.50 వేలు, మహిళలు రూ.లక్ష వరకు విలువ చేసే బంగారు ఆభరణాలు మాత్రమే ఎలాంటి సుంకం లేకుండా తెచ్చుకునే వీలుంది. ఒక కేజీ బంగారం తీసుకొస్తే అందులో 10.3 శాతం విలువ గల డబ్బును కస్టమ్స్ అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది. అంతకుమించి ఎక్కువ తీసుకొస్తే 36 శాతం చెల్లించాలి.

మరిన్ని వార్తలు