పగలు ఓకే... రాత్రికి షాకే!

1 Oct, 2018 09:53 IST|Sakshi
అబిడ్స్‌ పీఎస్‌ రిసెప్షన్‌లో వివరాలు తెలుసుకుంటున్న యూకే పోలీసులు(ఫైల్‌)

24 గంటలూ పని చేయని ఠాణా రిసెప్షన్లు

చీకటి పడిందంటేపట్టించుకునే నాథుడే కరువు

విధుల్లో ఉన్న సిబ్బంది సైతం ‘సొంత పనుల్లోనే’

కీలక నిర్ణయం తీసుకున్నసుల్తాన్‌బజార్‌ ఏసీపీ

ఆ డివిజన్‌లో రొటేషన్‌ పద్ధతి

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్లీజ్‌ రండి... దయచేసి కూర్చోండి. మీకు ఏం ఇబ్బంది వచ్చింది. మేం ఏ విధంగా సహాయం చేయగలం. ఫిర్యాదు రాసివ్వడానికి తెల్లకాగితం కావాలా?’
– పగటి వేళ ఠాణాకు వెళ్లినబాధితుడితో రిసెప్షన్‌ సిబ్బంది...

‘సార్‌.. ఒక్కసారి రండి. ఈ సమయంలో నాకు పెద్ద కష్టం వచ్చిపడింది. సాయం చేయండి. కంప్లయింట్‌ ఇవ్వాలని అనుకుంటున్నా. కుదిరితే ఓ కాగితం ఇప్పించగలరా?’– రాత్రి వేళ పోలీసుస్టేషన్‌కు వెళ్లినబాధితుడు పోలీసులతో...

రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఉన్న ఠాణాల్లో ఇవి నిత్యం కనిపించే సీన్లే. దేశంలోని మరే ఇతర పోలీసు విభాగంలోని లేని విధంగా, ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్లు కేవలం పగటిపూట మాత్రమే పని చేస్తున్నాయి. రాత్రి వేళల్లో విధుల్లో ఉంటున్న సిబ్బంది ‘తమ పనులు’ చూసుకోవడంలో బిజీగా ఉంటున్నారు. ఫలితంగా ‘డయల్‌–100’కు కాల్‌ చేస్తే మినహా... ఠాణాకు వచ్చిన బాధితులు నరకం చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని గుర్తించిన సుల్తాన్‌బజార్‌ ఏసీపీమాత్రం ఓ అడుగు ముందుకు వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.  

ప్రతిష్టాత్మకమైన హంగులతో...
పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు సర్వకాల సర్వావస్థల్లోనూ సహాయసహకారాలు అందించడానికి రిసెప్షన్స్‌ ఏర్పాటయ్యాయి. కొన్నేళ్ళ క్రితమే ఈ విధానం అమలులోకి వచ్చానా.. రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఆధునిక హంగులు చేకూరాయి. తెలంగాణ ప్రభుత్వం పోలీసుస్టేషన్ల నిర్వహణకు నిధులు సైతం మంజూరు చేస్తుండటంతో రిసెప్షన్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. ప్రధానంగా మహిళా కాస్టేబుళ్ళనే రిసెప్షనిస్టులుగా నియమిస్తున్నారు. ప్రజా సంబంధాలు, బాధితులతో మెగలాల్సిన విధానం, రికార్డుల నిర్వహణ తదితరాలకు సంబంధించి వీరికి ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. సమకాలీన అవసరాలకు తగ్గట్టు అదనపు అంశాలు నేర్పుతూ ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా చూసుకుంటున్నారు. ఈ కారణంగానే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు లండన్‌ వంటి విదేశాలకు చెందిన పోలీసులు సైతం వచ్చి ఇక్కడి రిసెప్షన్‌ విధానాలను అధ్యయనం చేసి వెళ్ళారు.  

రాత్రిపూట ఇప్పటికీ నరకమే...
ఈ రిసెప్షన్‌ సెంటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఠాణాలకు వస్తున్న బాధితులు ఇబ్బందులు ఎదుర్కోవడం అరుదుగా మారిపోయింది. అత్యవసర వింగ్‌గా పరిగణించే పోలీసు విభాగం అనేది 24 గంటలూ పని చేస్తుంటుంది. అయితే ప్రస్తుతం రిసెప్షన్స్‌ మాత్రం కేవలం పగటి పూట మాత్రమే పని చేస్తున్నాయి. ఈ కారణంగా రాత్రి వేళల్లో పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితుల్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ‘డయల్‌–100’ వ్యవస్థ పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంలో పని చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులు ఎవరైనా రాత్రి వేళ ‘100’కు కాల్‌ చేస్తే సరైన స్పందన ఉంటోంది. అలా కాకుండా నేరుగా పోలీసుస్టేషన్‌కు వస్తే మాత్రం అక్కడి వారిని బతిమలాడాల్సిందే. రాత్రి విధుల్లో ఉండే ఎస్సైలు, హెడ్‌–కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు వారి పనుల్లో బిజీగా ఉంటున్నారు. కేసు ఫైల్స్‌ అప్‌డేట్‌ చేసుకోవడమో, తర్వాతి రోజు కేసుల వివరాలు అధ్యయనం చేయడమో చేస్తూ ఉంటున్నారు. దీంతో బాధితులు వచ్చి బతిమాలుతున్నా సరైన స్పందన ఉండట్లేదు.  

కీలక నిర్ణయం తీసుకున్న చేతన...
సుల్తాన్‌బజార్‌ ఏసీపీగా పని చేస్తున్న ఐపీఎస్‌ అధికారిణి డాక్టర్‌ ఎం.చేతన ఈ ఇబ్బందితో పాటు మరికొన్ని అంశాలను గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఎం.రమేష్‌ అనుమతితో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విడిజన్‌లో ఉన్న అన్ని ఠాణాల్లోనూ ఓ మహిళా సిబ్బంది రాత్రి వేళల్లోనూ రిసెప్షన్‌ విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఎనిమిది గంటలకు ఒకరు చొప్పున ముగ్గురు రిసెప్షన్‌ నిబ్బంది నిర్విరామంగా విధుల్లో ఉంటున్నారు. ప్రసూతి వైద్యశాల, ఉస్మానియా ఆస్పత్రి, ఎంజీబీఎస్‌ సహా అనేక కీలక ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ ఉన్న ఈ డివిజన్‌కు ఈ నిర్ణయం ఉపయుక్తంగా మారింది.

ఇటీవల కొత్తగా డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన కానిస్టేబుళ్ళల్లో యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక్కడ వీరి సేవల్ని రిసెప్షన్‌ కోసం వాడుతున్నారు. ఇదే విధానాన్ని మరింత విస్తరిస్తూ మూడు కమిషనరేట్లలోని అన్ని ఠాణాల్లోనూ వినియోగించాలని బాధితులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో కూడిన, మారుమూల ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో కాకపోయినా మిగిలిన చోట్ల 24 గంటల రిసెప్షన్లు నిర్వహిస్తే బాధితులకు ఊరట లభిస్తుంది. ఇకనైనా దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు