ఠాణాలకు డిజిటల్‌ అడ్రస్‌

22 Jan, 2019 10:39 IST|Sakshi

జీపీఎస్‌ మ్యాపింగ్‌లో పొందుపరచాలని నిర్ణయం

పరిధులు, పోలీసుస్టేషన్ల చిరునామాలు ప్రజలకు తెలియడానికే..

చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చేరుకోవడం తేలికే

హాక్‌–ఐలో లింకు ఏర్పాటు  

ముమ్మర కసరత్తు చేస్తున్న డీజీపీ కార్యాలయం

సాక్షి, సిటీబ్యూరో: ‘రోడ్డపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్‌ను దుండగులు లాక్కుపోయారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి అతడు సమీపంలోని ఠాణాకు వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో తమ పరిధిలోకి రాదని చెప్పిన అధికారులు వేరే పోలీసుస్టేషన్‌ చిరునామా చెప్పి పంపారు. ఆ ఠాణాకు చేరుకోవడానికి బాధితుడికి కొంత సమయం పట్టింది. ఈ ఉదంతం అతడిని కొంత అసంతృప్తికి, అసౌకర్యానికి గురి చేసింది.’

.... రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండాచూడాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. అందులో భాగంగా ఠాణాలకు డిజిటల్‌ చిరుమానా ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం పోలీసుస్టేషన్ల పరిధులకు జియో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు వాటిని డైరెక్షన్స్‌తో సహా అధికారిక యాప్‌ ‘హాక్‌–ఐ’లో నిక్షిప్తం చేయనుంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ఎవరైనా తాము ఉన్న ప్రాంతం ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా దానికి ఎలా చేరుకోవాలో కూడా యాప్‌ సూచిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. 

అనేక చోట్ల పరిధుల పరేషాన్‌...
ఏదైనా ఓ ఉదంతం జరిగినప్పుడు కేసు నమోదు చేయాలన్నా, తదుపరి చర్యలు తీసుకోవాలన్నా జ్యూరిస్‌డిక్షన్‌గా పిలిచే పరిధి అత్యంత కీలకమైన అంశం. తమ పరిధిలోకి రాని కేసు విషయంలో ఓ పోలీసుస్టేషన్‌ అధికారులు కలగజేసుకుంటే చట్టపరంగానే కాకుండా ఇతర అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైనా సరే నేరం చోటు చేసుకున్న పరిధిలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిందే. అయితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పోలీసుస్టేషన్ల పరిధులు అనేవి పరేషాన్‌ చేస్తుంటాయి. రాజధానిలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1 మాసబ్‌ట్యాంక్‌ చౌరస్తా నుంచి నాగార్జున సర్కిల్‌ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఏరియా మొత్తం బంజారాహిల్స్, పంజగుట్ట, హుమాయున్‌నగర్‌ పోలీసుస్టేషన్ల కిందికి వస్తుంది. ఈ రోడ్డునకు ఒక్కో వైపు ఒక్కో ఠాణా పరిధిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అనేక సందర్భాల్లో అటు బాధితులే కాదు కొన్నిసార్లు పోలీసులూ తికమకపడ్డారు. 

గూగుల్‌ మ్యాప్స్‌లో ఉన్నప్పటికీ...
ఓ ప్రాంతంలో ఉన్న వ్యక్తి తన సమీపంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్‌తో పాటు పోలీసుస్టేషన్లనూ తెలుసుకునే అవకాశం గూగుల్‌ మ్యాప్స్‌ ఇచ్చింది. అయితే ఇది కేవలం సమీపంలో ఉన్న వాటిని మాత్రమే చూపించగలుగుతుంది. దానికే మార్గాన్ని నావిగేట్‌ చేస్తుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్‌ దగ్గర నిల్చున్న వ్యక్తి ‘పోలీస్‌ స్టేషన్‌ నియర్‌ బై మి’ అని టైప్‌ చేస్తే అది సరూర్‌నగర్‌ ఠాణాను చూపించే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఈ ప్రాంతం మలక్‌పేట ఠాణా పరిధిలోకి వస్తుంది. పరిధులు అన్నవి ఆ మ్యాప్స్‌లో అనుసంధానించి లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉంటోంది. బాధితులు ఎవరైనా నేరం బారినపడినప్పుడు ‘100’కు కాల్‌ చేస్తే పోలీసు వాహనమే వారి వద్దకు వస్తుంది. ఇలాంటప్పుడు ఇబ్బంది లేకపోయినా... ప్రతి సందర్భంలోనే బాధితులు కాల్స్‌ చేయడం సాధ్యం కాదు... ఆ అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే పోలీసుస్టేషన్ల పరిధులు, చిరునామాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది.  

హాక్‌–ఐలో లింకు రూపంలో...
దీనికోసం పోలీసు అధికారిక యాప్‌ హాక్‌–ఐలో ప్రత్యేక లింకు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధుల్నీ జియో ఫెన్సింగ్‌ చేస్తూ నావిగేషన్స్‌తో సహా ఇందులో నిక్షిప్తం చేస్తుంది. స్పార్ట్‌ ఫోన్‌ ఉన్న ఏ వ్యక్తి అయినా ఓ ప్రాంతంలో నిల్చుని అది ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ లింకు ఓపెన్‌ చేస్తే చాలు. ఈ వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని జీపీఎస్‌ ఆధారంగా గుర్తించే యాప్‌ ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో వెంటనే చెప్తుంది. మరింత ముందుకు వెళ్తే ఆ ఠాణాకు ఎలా చేరుకోవాలో కూడా స్పష్టంగా నావిగేట్‌ చేస్తుంది. అయితే రాష్ట్రంలోన్ని అన్ని ప్రాంతాల్లోనూ మొబైల్‌ డేటా సిగ్నల్స్‌ ఒకే విధంగా ఉండవు. దీంతో కొన్నిసార్లు నావిగేషన్, ఠాణా పరిధుల్ని యాప్‌ తప్పుగా చూపించే అస్కారం ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ట్రయల్‌ రన్‌ సందర్భంలో ఈ సమస్యల్ని గుర్తించి పరిష్కరించాలని నిర్ణయించింది. గరిష్టంగా రెండు నెలల్లో ఈ సదుపాయం హాక్‌–ఐలోకి వచ్చి చేసే ఆస్కారం ఉంది.

మరిన్ని వార్తలు