మహారాష్ట్ర నుంచి కాలినడకన..

31 Mar, 2020 09:41 IST|Sakshi
వసతుల గురించి ఆరాతీస్తున్న ఆర్డీఓ అమరేందర్‌

బొంగుళూరు వద్ద విద్యార్థులను ఆడ్డుకున్న పోలీసులు

ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పించిన మున్సిపల్‌ అధికారులు

విద్యార్థులందరూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులకు ఆదిబట్ల మున్సిపాలిటీ అండగా నిలిచింది. మహారాష్ట్ర నుంచి కాలినడకన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న వారిని చేరదీసి ఆశ్రయం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 39 మంది విద్యార్థులు మహారాష్ట్రలోని లాతూర్‌ సమీపంలో ఓసివాడి ప్రాంతంలోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా యూనివర్సిటీ మూతపడడంతో వారు స్వస్థలాలకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నెల 28న రాత్రి విద్యార్థులు మహారాష్ట్ర నుంచి కాలినడకన బయలుదేరారు. 50 కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత లారీలో బయలుదేరారు.

లారీ మధ్యలో పోలీసులు నిలిపివేయడంతో మళ్లీ అక్కడి నుంచి కాలినడకన హైదరాబాద్‌కు చేరుకున్నారు. నీళ్లు తాగి, బిస్కెట్లు తిని ప్రయాణం సాగించారు. ఆదివారం వారు ఆదిబట్లకు చేరుకున్నారు. వారిని గమనించిన పోలీసులు అందరిని నిలిపివేశారు. సీఐ నరేందర్‌ ఆధ్వర్యంలో వీరికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఎంపీపటేల్‌గూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు తరలించారు. వీరిని మున్సిపాలిటీ అధికారులు చేరదీశారు. మున్సిపల్‌ కమిషనర్‌ సరస్వతి చొరవ తీసకుని పాఠశాలలో బస కల్పించి భోజనం పెట్టారు.విద్యార్థులతో మాట్లాడిన ఆర్‌డీఓ,మున్సిపల్‌ చైర్‌పర్సన్‌విద్యార్థులతో ఆర్డీఓ అమరేందర్, ఆదిబట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆర్థిక మాట్లాడారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు ఇక్కడే ఉండాలని, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూస్తామని చెప్పారు. విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.  

మరిన్ని వార్తలు