పోలీసులు కావలెను!

11 May, 2018 07:06 IST|Sakshi

నేరడిగొండ పోలీసుస్టేషన్‌లో  సిబ్బంది లేక ఇబ్బంది

30 మందికి 12 మంది మాత్రమే..

 పూర్తిస్థాయిలో సేవలు అందించని పరిస్థితి పట్టించుకోని అధికారులు

నేరడిగొండ(బోథ్‌) : ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్‌లో సరిపడా సిబ్బంది లేక పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో 12 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు సరైన సమయంలో తగిన సేవలు అందకుండా పోతున్నాయి. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొత్తం 30 మంది సిబ్బంది ఉండాలి. అందులో ఒక ఎస్సై, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్‌ కానిస్టేబుళ్లతో పాటు 21 మంది కానిస్టేబుళ్లు ఉండాలి.

అలా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటే మండల వ్యాప్తంగా ఉన్న 14 గ్రామపంచాయతీల్లో సుమారు 30 వేలకు పైగా ఉన్న జనాభాకు సరైన సమయంలో రక్షణ కల్పించడంతో పాటు ఎలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగకుండా అడ్డుకోగలుగుతారు. కానీ ప్రస్తుతం ఆ స్టేషన్‌లో 12 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. మిగితా సిబ్బంది కొందరు డిప్యూటేషన్లపైన వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు.

 రోజువారీ పనులే అధికం.

డిప్యూటేషన్‌పై వెళ్లిన వారితో పాటు ఖాళీగా ఉన్న పోస్టులు మిగిలిన 12 మందిలో ఒకరు కోర్టు డ్యూటీ, మరొకరు రైటర్‌గా పనిచేస్తుండగా, ఇంకొకరు ఫిర్యాదులు తీసుకునేందుకు నిత్యం స్టేషన్‌లో ఉండాల్సి వస్తోంది. మిగిలిన 8 మంది, ఎస్సైతో పాటు ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఐదుగురు పోలీసులు ఉన్నారు. వీరితో మాత్రమే మండల ప్రజలకు రక్షణ కల్పించాల్సి వస్తోంది. దీంతో వారికి నిత్యం పనితప్ప ఏ ఒక్క గంట తీరిక దొరకడం లేదు.

అందులోనే అప్పుడప్పుడు జాతీయ రహదారి గుండా మంత్రులు, వివిధ ప్రజాప్రతినిధులు వెళ్తుండడంతో వారిని పంపించడంలో కొంత సమయం కోల్పోతున్నారు. దీంతోపాటు జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లో జరిగే పలు ఉత్సవాలు, పార్టీ సభలకు ఇక్కడి నుంచి ఎస్సైతో పాటు సిబ్బందిని బందోబస్తుకు పంపిస్తున్నారు. దీంతో మండల ప్రజలకు పోలీసుల సేవలు అందకుండా పోతున్నాయి. ఏదైనా దరఖాస్తులు ఇస్తే సిబ్బంది సరిపడా లేని కారణంగా రెండుమూడు రోజులు స్టేషన్‌ చుట్టూ తిరిగి తగవులు పరిష్కరించుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజలకు సరైన సమయంలో పోలీసు సేవలు అందించేందుకు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు విన్నవించాం

స్టేషన్‌లో సరిపడా సిబ్బంది లేని విషయాన్ని అనేకమార్లు ఉన్నతాధికారులకు విన్నవించాం. 16 మంది కానిస్టేబుళ్లు ఉండి ఉంటే ప్రజలకు అవసరమైన సేవలు వెంటనే అందించేవాళ్లం. ఇప్పటికీ కొంత ఇబ్బందవుతున్నా మెరుగైన సేవలందిస్తున్నాం. ప్రస్తుతం ఐదుగురు సిబ్బంది మాత్రమే ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. త్వరలోనే కొత్త సిబ్బందిని నియమిస్తామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు