శాస్త్రీయ ఆధారాలతో రుజువు...

7 Feb, 2020 02:41 IST|Sakshi

‘హాజీపూర్‌’ కేసులను సవాల్‌గా తీసుకున్న పోలీస్‌ శాఖ

శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ఖరారు చేయడం వెనుక కసరత్తు

సాక్షి, యాదాద్రి: హాజీపూర్‌ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్ష ఖరారు చేయడం వెనుక తీవ్ర కసరత్తే జరిగింది. అత్యాచారాలు జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేకున్నా.. శాస్త్ర, సాంకేతికత, వైద్యరంగాన్ని ఉపయోగించుకుని కేసును ఛేదించి నిందితుడికి ఉరి శిక్షపడటంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. పాఠశాలకు వెళ్తున్న బాలికలను టార్గెట్‌ చేసి లిఫ్ట్‌ ఇస్తానంటూ నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన వివరాలను పోలీసులు సమర్థంగా నిరూపించారు. నిందితుడి మొబైల్‌ కాల్‌డేటా, సాంకేతిక పరిజ్ఞానం, డీఎన్‌ఏ పరీక్షలు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక సాయంతో ఈ మూడు కేసుల్లో చార్జీషీటు దాఖలు చేశారు. హాజీపూర్‌ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, హత్యకు గురైన బాలికకు సంబంధించిన పుస్తకాల బ్యాగ్‌ ద్వారా నిందితుడిని గుర్తించారు.

సవాలుగా తీసుకున్న పోలీసులు 
హజీపూర్‌ బాలికల కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడిని వెం టనే పట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసి వ్యవసాయ బావుల్లో పూడ్చిపెట్టిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అరెస్టు విషయంలో ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక ఎస్సై వెంకటేశ్‌ను సస్పెండ్‌ చేశారు. కేసు విచారణ అధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ నియమించారు. ఏప్రిల్‌ 29న శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి వరంగల్‌ జైలుకు తరలించారు.

వివిధ శాఖల సహకారం 
రాచకొండ పోలీసులు.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖలు, ఫింగర్‌ ప్రింట్స్, క్లూస్‌టీం, ఐటీ సెల్, వివిధ పాఠశాలల బాలికలు, సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ విభాగాలు, డీఎన్‌ఏ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీలు, ఇంకా వివిధ విభాగాల ఆధారాల ఆధారంగా చార్జిషీట్‌లు దాఖలు చేసి నేరాన్ని రుజువు చేశారు.

రాచకొండ సిబ్బందికి డీజీపీ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని హాజీపూర్‌ వరుస హత్యలు, అత్యాచార ఘటనల కేసులో బాధితులకు న్యాయం జరిగిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. హంతకుడికి రెండు కేసుల్లో ఉరిశిక్ష, మరోకేసులో జీవిత ఖైదు పడిందన్నారు. ప్రాసిక్యూషన్‌తో పాటు కోర్టులో సాక్ష్యాలు సమర్పించడంలో సహకరించిన సాక్షులు, బాధిత కుటుంబీకులు, పౌర సమాజం, వేగంగా విచారణ పూర్తి చేసిన కోర్టుకు కృతజ్ఞతలు చెప్పారు. రికార్డు సమయంలో విచారణను పూర్తి చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో శ్రమించిన రాచకొం డ కమిషనర్‌ మహేశ్‌ భగవత్, యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి, భువనగిరి ఏసీబీ భుజంగరావుతోపాటు విచారణ బృందాన్ని అభినందించారు. కోర్టుకు సాక్ష్యాలను సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సీనియర్‌ పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ సి.చంద్రశేఖర్‌ను ఆయన మెచ్చుకున్నారు.

త్వరితగతిన కేసును ఛేదించాం: భగవత్‌ 
నల్లగొండ క్రైం: హాజీపూర్‌ నేర సంఘటనలో కేసును త్వరితగతిన ఛేదించామని, బాధితులకు నష్ట పరిహారం అందేలా చూస్తామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నేరస్తుడు శ్రీనివాస్‌రెడ్డి మైనర్లను తన బైక్‌పై తీసుకెళ్తానని నమ్మబలికి వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి బావిలో పడే శాడని తెలిపారు. జిల్లా కోర్టు చరిత్రలో 55 ఏళ్లలో డబుల్‌ కేసులో ఉరిశిక్ష పడటం ఈ కేసులోనే కావొ చ్చన్నారు. బాధిత కుటుంబాల కడుపుకోత, ఆవేదన ఎవరూ తీర్చలేనిదని.. చట్ట ప్రకారం నేరస్తుడి ని శిక్షించేందుకు అన్ని విధాలుగా తగిన సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించామని తెలిపారు. గ్రా మంలో నేటికీ పోలీసు పహారా ఉంచామన్నారు.

మరిన్ని వార్తలు