ఆర్తనాదాలే ఆధారం!

31 Jan, 2020 07:53 IST|Sakshi

సమత కేసులో మానవ సహిత ఆధారాలు, సాక్ష్యాలే కీలకం

దిశతో పోలిస్తే సమత కేసు ఛేదనలో పోలీసులకు అనేక సవాళ్లు

సాక్షి, ఆసిఫాబాద్‌: మారుమూల అటవీప్రాంతం.. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేవు.. సాంకేతిక ఆధారాల్లేవు.. ఇన్ని సవాళ్ల మధ్యా ‘సమత’ కేసును పోలీసులు సమర్థంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. పైగా సమత ఘటన జరిగిన 3 రోజుల తర్వాత వెటర్నరీ డాక్టర్‌ దిశ ఘటనతో పోలిస్తే సమత కేసు మరింత సంక్లిష్టమైన కేసుగా చెప్పుకోవచ్చు. ఈ ఘటనలు 2 రోజుల వ్యవధిలో ఒంటరి మహిళలే లక్ష్యంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి అతికిరాతకంగా వారిని దుండగులు హత్య చేశారు. నిందితులపై కోర్టులో నేరం రుజువు కావాలంటే ఆధారాలు కీలకం.

సిగ్నల్స్‌ కూడా లేవు: దిశ కేసులో నిందితుల స్మార్ట్‌ఫోన్ల వాడకం తదితరాలన్నీ ఆధారాల సేకరణలో పోలీసులకు ఉపయోగపడ్డాయి. అయితే ‘సమత’ ఘటన జరిగిన ఏజెన్సీలో ఇవేవీ లేవు. కనీసం ఇక్కడ ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా లేవు. దీంతో వివరాలు సేకరించడం పోలీసులకు సవాలుగా మారింది. అయినా ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణతోపాటు జైనూర్, వాంకిడి సీఐలు, లింగాపూర్, జైనూర్‌ ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి త్వరితగతిన కేసు దర్యాప్తు ముగించేందుకు శ్రమపడ్డారు. సేకరించిన ఆధారాలకు కోర్టులో నిరూపితం అయ్యేలా డీఎన్‌ఏ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు తీసుకుని శాస్త్రీయత జోడిస్తూ కోర్టులో చార్జిషీటు వేశారు. దీంతో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు నిందితులే ఘాతూకానికి పాల్పడినట్లు నమ్మడంతో నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చేసింది.

ఎస్పీ మల్లారెడ్డికి సమత భర్తపాదాభివందనం
అక్కడి నుంచే అడుగు ముందుకు..
ఘటన రోజు బాధితురాలిని బలవంతంగా ఎల్లాపటార్, రామ్‌నాయక్‌ తండా మధ్యలో రోడ్డుకు ఆనుకొని ఉన్న అటవీలోకి తీసుకెళ్తుండగా ఆర్తనాదాలు చేసింది. ఆ సమీపంలోని పత్తి చేను లో ఉన్న పలువురు ఆ ఆర్తనాదాలు విన్నారు. ఆ ఆర్తనాదాలు విన్న సాక్షుల ద్వారానే కేసు విచారణ ముందుకు సాగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత నిందితులు దాహం తీర్చుకునే సమయంలో వారి బట్టలపై రక్తపు మరకలు చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ కేసులో బలమైన ఆధారంగా మారారు. నిందితుల బట్టలపై రక్తపు, ఇతర మరకలు, నిందితులు వాడిన కత్తి తదితరాలు డీఎన్‌ఏ రిపోర్టుతో సరిపోలాయి. దిశ ఘటనలో అక్కడి పోలీసులు ఆధునిక సాంకేతికతపై అధికంగా ఆధారపడగా.. సమత ఘటనలో మాత్రం పోలీసులు అధికంగా మానవసహిత ఆధారాలతోనే దర్యాప్తు పూర్తిచేశారు. 

మరిన్ని వార్తలు