సరైన ‘దిశ’లో..

5 Dec, 2019 02:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఉదంతం దేశవ్యాప్తంగా పోలీసులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. మహిళలు, యువతుల భద్రత విషయంలో వారు తీసుకుంటున్న చర్యల ‘దిశ’మారుస్తోంది. పంజాబ్‌ లోని లూధియానా, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌ సహా అనేక మెట్రో నగరాల పోలీసులు మహిళల భద్రత విషయంలో వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

రాచకొండ నుంచే మొదలైన సేవలు.. 
‘దిశ’ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే తొలుత స్పందించింది రాచకొండ పోలీసులే. సీపీ మహేశ్‌ భగవత్‌ గత గురువారమే స్పందించి యువతులు, మహిళలకు అదనపు సేవలు అందించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. వాహనాల్లో పెట్రోల్‌ అయిపోయినా, పంక్చర్‌ అయినా పోలీసులకు ఫోన్‌ చేయాలని లేదా వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. ఈ సర్వీసును ఆ మరుసటి రోజు నుంచే అనేక మంది వినియోగించుకున్నారు. 

లూధియానాలో ఫ్రీ ట్రావెల్‌ సర్వీస్‌.. 
రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, యువతుల కోసం పంజాబ్‌లోని లూధియానా పోలీసులు ఆదివారం నుంచి కొత్త సర్వీసు ప్రారంభించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మహిళలకు సురక్షితమైన ప్రయాణం అందించేందుకు ఉచితంగా సేవలందిస్తున్నారు. ఆ సమయాల్లో ప్రయాణించేందుకు వాహనం దొరక్కపోతే పోలీసులకు ఫోన్‌ చేయాలంటూ రెండే ప్రత్యేక నంబర్లు కేటాయించారు. వీటికి కాల్‌ చేస్తే కంట్రోల్‌రూం వాహనం లేదా స్థానిక స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వాహనం వచ్చి సదరు మహిళను సురక్షితంగా గమ్య స్థానానికి చేరుస్తాయని లూధియానా పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ అగర్వాల్‌ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.  

బ్యాన్‌ చేసిన బెంగళూరు కాప్స్‌.. 
‘దిశ’పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులు ఆమెపై పెట్రోల్‌ పోసి కాల్చేశారు. పెట్రోల్‌ను ఓ బంకు నుంచి బాటిల్‌లో కొని తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని అన్ని బంకులకు పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు సోమవారం నోటీసులు జారీ చేశారు. బాటిళ్లు, క్యాన్లతో వచ్చే వారికి ఇంధనం విక్రయాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని బంకుల్లో బోర్డుల ద్వారా అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయించారు.  

కోల్‌కతాలో కెమెరాల ఏర్పాటు.. 
పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ అంజూ శర్మ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ‘దిశ’కేసును ప్రస్తావించి.. అలాంటి ఘటనలు కోల్‌కతాలో జరగకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటిలో భాగంగా కళాశాలలు, పాఠశాలలు ఉన్న ప్రాంతాలతో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాధారణంగా మహిళలు, యువతులు కాలకృత్యాల కోసం నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లి దుండగుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా మొబైల్‌ టాయిలెట్స్‌ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు

మరిన్ని వార్తలు