మహిళా పోలీస్‌ వాలంటీర్లు వస్తున్నారు!

12 Oct, 2018 00:47 IST|Sakshi

మహిళలపై నేరాల నియంత్రణకు మధ్యప్రదేశ్‌ ఫార్ములా

నల్లగొండ, గద్వాల జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా..  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో జరిగే ప్రతీ విషయాన్ని, నేరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించేందుకు ఇప్పటికే వీపీవో(విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌) వ్యవస్థ తెలంగాణలో అందుబాటులో ఉంది. ఇదే తరహాలో.. గ్రామాల్లో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులు, ఇతర ఘటనల నేపథ్యంలో.. పోలీసులు, బాధితుల మధ్య వారధిగా పనిచేసేలా నూతన వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. ఇదే మహిళా పోలీస్‌ వాలంటీర్‌ వ్యవస్థ.

కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఎదురవుతున్న వేధింపులు, వారిపై జరుగుతున్న దాడులు, వరకట్న హత్యలు, ఆత్మహత్యలు తదితర నేరాలను నియంత్రించేందుకు ‘మహిళా పోలీస్‌ వాలంటీర్ల’ను నియమించనుంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఈ మహిళా పోలీస్‌ వాలంటీర్‌ విధానం ద్వారా సత్ఫలితాలు సాధించింది. దీంతో ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలుచేసేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖ సన్నాçహాలు చేస్తోంది.

పనితీరును బట్టి బహుమతులు..
ఈ వాలంటీర్లకు నెలకు రూ.500 గౌరవ వేతనంగా అందించనున్నారు. అదే విధంగా ప్రతి మూడు నెలలు, ఆర్నెల్లకోసారి వేధింపుల నియంత్రణలో పనితీరును బట్టి రూ.10వేలు, రూ.5వేలు, రూ.3 వేలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

అయితే రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా ఉన్నవారు, నాయకులుగా చెలామణి అవుతున్నవారు, నేరచరిత్ర కల్గిన వారు ఈ వాలంటీర్‌ పోస్టుకు అనర్హులని పోలీ స్‌ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీస్, స్త్రీ–శిశు సంక్షే మశాఖ నేతృత్వంలో ఈ వ్యవస్థ పనిచేస్తుందని, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ నేరాల నియంత్రణ, మహిళావేధింపుల కట్టడికి కృషిచేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.  

21 ఏళ్లు, ఇంటర్‌ పాస్‌ తప్పనిసరి...
రాష్ట్రంలో నల్లగొండ, జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతీ గ్రామంలో మహిళా పోలీస్‌ వాలంటీర్‌ను నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇంటర్‌ పాసయిన 21 ఏళ్ల యువతులకు వాలంటీర్‌గా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీరు.. గ్రామాల్లో మహిళలపై జరిగే వేధింపులు, ఇతర నేరాలను స్థానిక స్టేషన్‌కు చేరవేయాల్సి ఉంటుంది. దీంతో పోలీస్‌ అధికారులు కేసులు నమోదు చేయడం, వేధింపులను నియంత్రించడం సులభతరం కానుంది.

మరిన్ని వార్తలు