పోలీస్ వాట్సప్

19 Dec, 2014 03:15 IST|Sakshi

కరీంనగర్ క్రైం: రోడ్డుపై వెళుతున్న మీ పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా...?
 పోలీస్‌స్టేషన్‌కు వెళితే సిబ్బంది మిమ్ముల్ని ఇబ్బందులు పెడుతున్నారా...?
 మీ కాలనీలో అనుమానితులెవరైనా సంచరిస్తున్నారా...?
 ట్రాఫిక్ రద్దీగా క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులెవరు కన్పించడం లేదా...?
 మీరు చదువుకునే కాలేజీల్లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారా...?
 వీటికోసం మీరు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులు వస్తారా? రారా? అని సందేహించాల్సిన పనిలేదు. మీ మొబైల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ వ్యవస్థ ఉంటే చాలు. జరుగుతున్న ఘటనను ఫొటో తీసి సంబంధిత సమాచారాన్ని వ్యాట్సప్‌కు పంపితే చాలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకుని నేరాలను అరికట్టడమే కాకుం డా ప్రజలకు మరింత దగ్గరగా చేరువయ్యేం దుకు కరీంనగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ-రక్ష, ఈ-శోధన, ఈ-టెక్నాలజీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ బాస్ శివకుమార్ తాజాగా వాట్సప్ సేవలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అతి త్వరలో వాట్సప్ నెంబర్‌ను ప్రజల ముందుకు తీసుకురానున్నారు.
 
 వాట్సప్ సమాచారంపై ప్రత్యేక దృష్టి
 వాట్సప్ నంబర్‌కు వస్తున్న వివిధ రకాల చిత్రాలను, సమాచారాన్ని పర్యవేక్షించేందుకు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వాట్సప్ ద్వారా వచ్చిన సమాచారాన్ని 52 సీసీ టీవీల ద్వారా ఎప్పటికప్పుడు వీక్షించేందుకు సిబ్బందిని నియమిస్తారు. ఎక్కడినుంచి సమాచారం వచ్చిందో తెలుసుకుని అక్కడికి దగ్గర్లో ఉన్న అధికారులకు సమాచారం పంపిస్తారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం డయల్ 100 వ్యవస్థ ఉన్నప్పటికీ అది హైదరాబాద్‌లోని కంట్రోల్ రూంలో ఉండటం, అక్కడినుంచి జిల్లాలకు వెళ్లడం, ఆ తరువాత సంబంధిత పోలీస్‌స్టేషన్ల కు వెళ్లడం వల్ల కొంత సమయం వృథా అవుతోంది.
 
 దీంతోపాటు పలువురు ఆకతాయిలు డయల్ 100కు తప్పుడు సమాచారం ఇస్తూ పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారు. అట్లాకాకుండా వాట్సప్ నంబర్‌కు వచ్చే ఫొటోలు, సమాచారాన్ని చూసి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. అనుమానితుల ఫొటోలను పోలీసు రికార్డులో ఉన్న వాటితో సరిపోల్చి చూసేందుకు వాట్సప్ చిత్రాలు ఉపయోగపడుతాయి. త్వరలో జిల్లా పోలీస్ శాఖ ఒక వాట్సప్ నంబర్‌ను ప్రకటించనున్నది. ప్రజలకు తేలిగ్గా గుర్తుండేందుకు ఫ్యాన్సీ నెంబర్‌కు ఎంపిక చేసే పనిలో పడింది. రెండు మూడు రోజుల్లో ఈ నెంబర్‌ను ప్రకటిస్తారు.  
 
 టెక్నాలజీలో పరుగులు
 రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎస్పీ కార్యాలయం సోలార్ పవర్‌తో నడిపిస్తున్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్స్ పనులు ప్రారంభించింది. ప్రస్తుతం ఎస్పీ కార్యాలయానికి కావాల్సిన విద్యుత్‌ను సోలార్ నుంచే తయారు చేస్తున్నారు. తెలంగాణలో ఈ ఏర్పాటున్న మొదటి ఎస్పీ కార్యాలయంగా స్థానం సంపాదించింది. ఇప్పటికే జిల్లా అంతాటా సీసీ కెమోరాల నిఘా ఏర్పాటు చేశారు.
 
  సిరిసిల్లను స్మార్ట్ పోలీస్ సిటీగా రూపొందించే కార్యక్రమాలు దాదాపు పూర్తవుతున్నాయి. వీటిలో పాటు జిల్లాలో మరో ఏడు ప్రధాన పట్టణాలను స్మార్ట్ పోలీస్ సిటీలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. పోలీసు అధికారులకు ట్యాబ్ అందజేత, త్రినేత్ర, పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, రోడ్డు ప్రమాదాల కోసం ప్రత్యేక డ్రైవ్, ఈ-రక్ష, ఈ-శోధన, ఈ-టెక్నాలజీ పేరుతో పలు కార్యక్రమాలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు