మరణించిన వారు వచ్చి రిజిస్ట్రేషన్‌!

26 Jul, 2019 08:25 IST|Sakshi
జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విచారిస్తున్న సీఐ తదితరులు

ఫొటోలు మార్చి తప్పుడు పత్రాలతో భూమి స్వాహా

పోలీసుల దర్యాప్తులో తేటతెల్లం

నిందితుల రిమాండ్‌

జడ్చర్ల: వారు మరిణించి దశాబ్దాంన్నరకు పైగానే గడిచింది. కానీ వారి పేరున ఉన్న వ్యవసాయ భూములు మాత్రం వారే వచ్చి ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇది నమ్మలేకున్నా జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తేటతెల్లం కావడంతో ఇలాంటి మోసాలకు పాల్పడిన నిందితులు కటకటాలపాలయ్యారు. జడ్చర్ల రూరల్‌ సీఐ శివకుమార్‌ కథనం మేరకు.. రాజాపూర్‌ మండలం తిరుమలిగిరికి చెందిన పాత్లావత్‌ ఘాన్సీబాయికి సర్వే నంబర్‌లు 189, 208, 211, 212, 200లో 5.18 ఎకరాల భూమి ఉంది. అదేవిదంగా పాత్లావత్‌ కేశవులుకు సర్వే నంబర్‌లు 200/1యు, 212/ఆర్‌యు, 211/1యులలో 4.04 ఎకరాల భూమి ఉంది.

అయితే వీరు దాదాపు 15సంవత్సరాల క్రితమే మరణించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన పాత్లావత్‌ దీప్లా, పాత్లావత్‌ రమేశ్, పాతాల్వత్‌ అంబ్రి, సీత్యాలు తప్పుడు ఆధార్‌ కార్డులు, తదితర పత్రాలు సృష్టించి 2010లో ఇతరులు పేరున వారి భూమిని జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆధార్‌ కార్డుల్లో ఫొటోలు మార్చి రిజిస్ట్రేషన్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 2018లో ఘాన్సీబాయి కూతురు జమున, తదితరులు బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం గురువారం వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితులకు సహకరించిన అప్పటి వీఆర్‌ఓ, సర్పంచ్, తదితరులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఈసందర్భంగా సీఐ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు