‘ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు’

12 Oct, 2018 17:18 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు జరుగనున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు.  దీనిలో భాగంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా 17వ తేదీలోగా పోలీస్‌ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం ఈసీతో సమావేశం అనంతరం మహేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా పోలీసుల, రేంజ్‌ డీజీలతో సమావేశమయ్యామని, ఈసీ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

వీవీప్యాట్స్‌తో పాటు సీ విజిల్‌, సువిధ యాప్‌లను పోలీసులు ఎలా వినియోగించుకోవాలో అనే దానిపై ప్రధానంగా శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలను ఎలా గుర్తించాలి అనే వాటిపై చర్చించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పోలీసులను వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. ఇప్పటికే రౌడీషీటర్లపై బైండోవర్‌ కేసులు వంటి చేస్తున్నామన్న డీజీపీ.. లైసెన్స్‌ తుపాకులను డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అదే సమయంలో ఒకే జిల్లాలో మూడు సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారిని బదిలీలు చేయాలని జిల్లా అధికారులకు సూచించామన్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పక్క రాష్ట్రిల పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటామని మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు