చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

16 Jul, 2019 18:28 IST|Sakshi

రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి అభినందనలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఒకే విధమైన సేవలను అందించేవిధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాధితులు ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చందానగర్ పోలీసులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని, ప్రజలను భాగస్వాములను చేస్తూ నేరాల అదుపునకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలలో భద్రతా భావాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి సిబ్బంది స్కిల్ డెవలప్‌మెంట్‌ను పెంపొందించుకొని సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ని అనుసరిస్తూ, కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులను ఎప్పడికప్పుడు క్లియర్ చేస్తున్నారని పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్లలో ఉన్న పనులను 16 విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగానికి ఒక్కో అధికారిని నియమించి వారికీ బాధ్యతలు అప్పజెప్పి నూతన టెక్నాలజీ సహకారంతో నేరస్థులకు శిక్షలు పడేలా చేస్తున్నామన్నారు. ప్రజలే-పోలీసులు, పోలీసులే-ప్రజలు అనే భావన కలిగించిన చందానగర్ పోలీసుల పనితీరుకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు చందానగర్ పీఎస్‌ను ఆదర్శవంతంగా తీసుకొని పనిచేయాలన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభత్వం ఒకేసారి 18 వేల పోలీస్ సిబ్బంది నియామకాలు చేపట్టడం గొప్ప విషయమని డీజీపీ చెప్పారు.
 

మరిన్ని వార్తలు